Site icon HashtagU Telugu

Revanth Reddy: 50 వేల కోట్ల స్కామ్.. మోదీ అండ్ కేసీఆర్‌లను ఉతికేసిన రేవంత్..!

Revanthreddy

Revanthreddy

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్న కోల్ స్కాంపై మోడీ స‌ర్కార్ ఎందుకు మౌనం వ‌హిస్తుందో చెప్పాల‌ని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. 50 వేల కోట్ల స్కాం జ‌రిగింద‌ని, డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్‌ని సీఎండీగా కొనసాగిస్తున్నార‌ని, దీంతో ప్రధాని మోదీకి.. కోల్ ఇండియాకి ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌ని రేవంత్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ అండ్ మోదీకి ప‌డ‌నప్పుడు సింగరేణి సంస్థ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదరి రేవంత్ ప్ర‌శ్నించారు. ఒక‌వైపు అధాని దగ్గర కరెంట్ కొనాలని ప్ర‌ధాని మోదీ ఒత్తిడి పెంచుతున్నారని ఇటీవ‌ల‌ కేసీఆర్ వ్యాఖ్య‌లు చేశారు. మరి సింగరేణి బొగ్గును అదానీకి కట్టపెడుతుంటే మోదీకి క‌నిపించ‌డంలేదా.. అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో భూగర్భ గనులను కేసీఆర్ కుటుంబం దోచేస్తోందని, కేసీఆర్ కుటుంబ దోపిడీపై, బీజేపీ స‌ర్కార్ ఎందుకు నివేదిక అడగడంలేద‌ని రేవంత్ ప్ర‌శ్నించారు.

కేంద్ర ప్ర‌భుత్వం వాటా ఉన్న రాష్ట్ర‌ సంస్థలో 50 వేల కోట్ల అవినీతి జరుగుతుంటే ప్ర‌ధాని మోదీ ఎందుకు స్పందించడం లేదో అర్ధంకావ‌డంలేద‌న్నారు. మ‌రోవైపు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఎందుకు సైలెంట్ ఉంటున్నార‌ని రేవంత్ ప్ర‌శ్నించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కి ఫిర్యాదు ఫార్వర్డ్ చేయండని అడ‌గ్గా, చేయడం కుద‌ర‌ద‌ని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ల‌కు ల‌బ్ది చేకూర్చేలా శ్రీధ‌ర్ నిర్ణ‌యాలు ఉన్నాయ‌ని, టెండర్ అయ్యాక, టెండర్ దారుడు ఇంకో పెట్టుబడి దారున్ని తెచ్చుకోవచ్చని శ్రీధ‌ర్ కొత్త‌ నిబంధన పెట్టారని, శ్రీధర్ నిర్ణయాలతో జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు.

కేంద్ర ప్ర‌భుత్వం సైలెంట్‌గా ఉంది అంటే న‌రేంద్ర‌ మోదీ, కేసీఆర్ అండ్ గులాబీ గ్యాంగ్ చేస్తున్న‌ అవినీతికి మద్దతు ఇస్తున్నట్లే అని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ దోపిడీకి పాల్పడితే జైలుకు పంపిస్తామ‌ని వ్యాఖ్య‌లు చేస్తున్న బండి సంజయ్, కిషన్ రెడ్డి ల‌కు రేవంత్ సవాల్ విసిరారు. న‌రేంద్ర మోదీ ద‌గ్గ‌ర కేసీఆర్ సుపారీ తీసుకున్నార‌ని, దీంతో తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను బ‌ల‌హీన‌ప‌ర్చి, బీజేపీ బ‌లాన్ని పెంచే ప‌నిలో ఉన్నార‌ని, ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉండే పార్టీల‌తో క‌లిసి యూపీఏని బ‌ల‌హీన‌ప‌ర్చేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మ‌రి రేవంత్ వ్యాఖ్య‌ల పై టీఆర్ఎస్ అండ్ బీజేపీల నుంచి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో చూడాలి.