Revanth Reddy : రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రాధాన్యత పెరిగిందట.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందంటూ..

రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రేవంత్ వల్లే మొత్తం కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందనే వ్యాఖ్యలపై మిగిలిన సీనియర్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 08:00 PM IST

ఇటీవల తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్(Congress) గ్రాఫ్ పెరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కి సపోర్ట్ గానే మారుతుంది. గతంతో పోలిస్తే చాలా చోట్ల కాంగ్రెస్ బలపడింది. ఇక కేసీఆర్(KCR) ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఉన్న బిఆర్ఎస్(BRS) నాయకులంతా కాంగ్రెస్ లోకే వస్తున్నారు. రాబోయే ఎలక్షన్స్(Elections) లో కాంగ్రెస్ నుంచి పోటీకి దిగడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

త్వరలో కాంగ్రెస్ మరిన్ని సభలు, సమావేశాలు ఏర్పాటు చేయనుంది. ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బహిరంగ సభల కోసం ప్లాన్ చేస్తుంది. దీని కోసం పోలీసుల పర్మిషన్ కి ఇవాళ రేవంత్ రెడ్డి(Revanth Reddy) డీజీపీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 16, 17 న తాజ్ కృష్ణ లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయని, 17న విజయ భేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఇందుకు సంబంధించి భద్రతను అందించాలని డీజీపీని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపాడు.

అయితే రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలుగా తెలంగాణ కాంగ్రెస్ కి ప్రాధాన్యత పెరిగింది. ప్రాధాన్యత వ్యక్తులకు పెరగలేదు, పార్టీకి పెరిగింది. నేను పీసీసీ చీఫ్ అయ్యాక కోట్లాడి మా నాయకులకు పదవులు తెస్తున్నా. గతంలో జరగని కార్యక్రమాలు ఈ రెండేండ్లలో జరిగాయి. నేను పీసీసీ చీఫ్ అయ్యాక అనేక మంది జాతీయ నాయకులు వరుసగా తెలంగాణకి వస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నుండి 2021 వరకు దాదాపు 156 మంది కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. 2021 జూలై నుండి ఇప్పటి వరకు పార్టీ మారిన వాళ్ళు, వచ్చిన వాళ్ల లెక్క వేయండి. గతంలో సిట్టింగ్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు సిట్టింగులు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కమ్యూనిస్టులు గాంధీ భవన్ వచ్చి చర్చలు జరిపారు. తర్వాత నేను పీసీసీ చీఫ్ అయ్యాకే వస్తున్నారు. ఎన్నికలున్న వేరే రాష్ట్రాల్లో CWC సమావేశాలు పెట్టకుండా తెలంగాణకే అవకాశం ఇచ్చారంటే తెలంగాణ కాంగ్రెస్ కి జాతీయ నాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. రెండేళ్లుగా మేం చేసినటువంటి సభలు అధికార పార్టీ కూడా చేయలేకపోయింది అని అన్నారు.

దీంతో రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రేవంత్ వల్లే మొత్తం కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందనే వ్యాఖ్యలపై మిగిలిన సీనియర్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Also Read : Revanth Reddy: హోంగార్డు రవీందర్‌ది ఆత్మహత్య కాదు, కేసీఆర్ చేసిన హత్య: రేవంత్ రెడ్డి