కేటీఆర్ దెబ్బ‌కు రేవంత్ ఢ‌మాల్.. గాడిద‌పై రేవంత్ బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌

  • Written By:
  • Updated On - September 18, 2021 / 02:11 PM IST

రాజ‌కీయంగా అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వాళ్ల‌ను టార్గెట్ చేయ‌డం తొలి నుంచి రేవంత్ కు అల‌వాటు. వాళ్ల‌కు సంబంధించిన లోపాల‌ను, అక్ర‌మాల‌ను వెలికి తీస్తుంటారు. అందుకే, కేవలం 15 ఏళ్ల రాజ‌కీయ జీవితంలోనే అత్యున్న‌త పీసీసీ ప‌ద‌విని చేజిక్కించుకున్నాడు. ఆ విష‌యాన్ని స‌న్నిహితుల వ‌ద్ద రేవంత్ ప్ర‌స్తావిస్తుంటాడ‌ని ఆయ‌న అభిమానులు చెబుతారు. ఇప్పుడు కూడా మాజీ కేంద్ర మంత్రి, గాంధీ ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుడు శ‌శిథ‌రూర్ ను రేవంత్ టార్గెట్ చేశాడు. ఎలాంటి స‌మాచారం లేకుండా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి వెళ్లాడ‌ని శ‌శిథ‌రూర్ ను గాడిద గా రేవంత్ అభివ‌ర్ణించాడు. అంతేకాదు, ఇంగ్లీషు బాగా మాట్లాడినంత మాత్ర‌న గొప్పోళ్లు కాద‌ని థ‌రూర్ కు చుర‌క‌లు అంటించారు. మీడియాలో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రేవంత్ మెడ‌కు చుట్టుకున్నాయి. చివ‌ర‌కు థ‌రూర్ కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పే వ‌ర‌కు రేవంత్ నోటి దురుసు వ్య‌వ‌హారం వెళ్లింది. దీన్ని ఇప్పుడు అంటు కేటీఆర్ తో పాటు కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ వ్య‌తిరేఖ గ్రూపు అనుకూలంగా మలుచుకుంది.

మంత్రి కేటీఆర్, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మ‌ధ్య జ‌రిగిన ట్వీట్ల వార్ ఢిల్లీ వ‌ర‌కు చేరింది. చివ‌ర‌కు రేవంత్ రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పే వ‌ర‌కు వెళ్లింది. వివ‌రాల్లోకి వెళితే, తెలంగాణ‌లో ఐటీ అభివృద్ధి గురించి ఇటీవ‌ల కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ శ‌శిథ‌రూర్ ప‌రిశీలించారు. అంతేకాదు, పార్ల‌మెంట‌రీ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ సంఘం చైర్మ‌న్ గా శ‌శ‌థ‌రూర్ ఉన్నారు. దీంతో తెలంగాణ ఐటీ అభివృద్ధి స‌భ‌కు వ‌చ్చిన ఆయ‌న ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇదే విష‌యాన్ని ట్వీట్ల ద్వారా కేటీఆర్ ప్ర‌చారం చేశారు. అందుకు సంబంధించిన ట్వీట్ల‌పైన రేవంత్ రెడ్డి ప్ర‌తి స్పందించారు. తెలంగాణ అభివృద్ది గురించి ప‌లు ర‌కాల ట్వీట్లు చేస్తోన్న కేటీఆర్ పైన ట్విట్ట‌ర్ వేదిక‌గా రేవంత్ విమ‌ర్శ‌లు కురిపించారు. వాటికి స‌మాధానంగా ఐటీ అభివృద్ధి గురించి శ‌శిథ‌రూర్ చేసిన ప్ర‌శంస‌ల క్లిప్పింగ్ ల‌ను జ‌త చేశారు కేటీఆర్. అందుకు ప్ర‌తి స్పందించిన రేవంత్ బోల్తా ప‌డ్డారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి ప్ర‌శంస‌లు కురిపించిన థ‌రూర్ ను గాడిద‌గా పోల్చారు రేవంత్. ఆ ట్వీట్ ను శ‌శిథ‌రూర్ కు కేటీఆర్ లింక్ చేశాడు. ఆ విష‌యాన్ని తెలుసుకున్న రేవంత్ నేరుగా శ‌శిథ‌రూర్ కు క్ష‌మాప‌ణ చెప్పాడు. పెద్ద మ‌న‌సుతో థ‌రూర్ క్ష‌మించాడు. కానీ, రేవంత్‌, కేటీఆర్ మ‌ధ్య జ‌రిగిన ఈ ట్వీట్ల వార్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా కేటీఆర్ చేసిన వ్యూహ‌మంటూ కొంద‌రు..కాదు రేవంత్ నోటి దురుసుత‌న‌మ‌ని ఇంకొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గ‌జ్వేల్ స‌భ‌కు లింకు చేస్తూ ఈ ట్వీట్ల యుద్ధాన్ని కొంద‌రు రాజ‌కీయ కోణం నుంచి చూస్తున్నారు. కాంగ్రెస్ పెద్ద‌లు చాలా కాలంగా రేవంత్ దూకుడు మీద ఆగ్ర‌హంగా ఉన్నారు. ఒన్ మేన్ షో చేస్తున్నాడ‌ని రేవంత్ పై టీపీసీసీలోని కొంద‌రు సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు. ఆ మేర‌కు అధిష్టానంకు కూడా ఫిర్యాదు చేశారు. వాళ్ల ఫిర్యాదుకు బ‌లంచేకూరేలా థ‌రూర్ మీద రేవంత్ త‌న దురుసుత‌నాన్ని ప్ర‌ద‌ర్శించారు. దీంతో ఢిల్లీలో రేవంత్ కు ఉన్న క్రేజ్ త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని సీనియ‌ర్లు భావిస్తున్నారు. మ‌రో వైపు కేటీఆర్ తాను ప‌న్నిన వ‌ల‌లో రేవంత్ ప‌డ్డాడ‌ని భావిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో చిక్కిన థ‌‌ర్డ్ గ్రేడ్ క్రిమిన‌ల్ అంటూ రేవంత్ ను కేటీఆర్ టార్గెట్ చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హీట్ పెరిగింది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో రేవంత్ దూకుడు అడ్డుగా మారుతుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. పైగా రేవంత్ వాల‌కం గురించి తెలిసిన వాళ్లు, రాబోయే రోజుల్లో నేష‌న‌ల్ లీడ‌ర్ గా ఎద‌గ‌డానికి ఇదో ఎత్తుగ‌డ‌గా అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో నేష‌న‌ల్ లీడ‌ర్ల‌ను టార్గెట్ చేసి ఆ స్థాయికి ఎద‌గాల‌ని రేవంత్ ప్లాన్ చేస్తాడ‌ని ఇంకొంద‌రు అంచ‌నాలు వేస్తున్నారు. ఏది ఏమైనా, రేవంత్ రాష్ట్రా స్థాయి లీడ‌ర్ల‌ను టార్గెట్ చేసి 15ఏళ్ల‌లోనే పీసీసీ ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఇప్పుడు నేష‌న‌ల్ లీడ‌ర్ల‌పై విమ‌ర్శ‌లు,ఆరోప‌ణ‌లు చేయ‌డం ద్వారా ప్ర‌ధాని ప‌ద‌వి కోసం ఎత్తులు ప్రారంభిస్తాడ‌ని కాంగ్రెస్ లోని సీనియ‌ర్ల మ‌ధ్య టాక్. గ‌త 15 ఏళ్లుగా తాను ఎంచుకున్న మార్గం చాలా వ‌ర‌కు రేవంత్ కు రాజ‌కీయ విజ‌యాన్ని అందించింది. అదే పంథా రాబోయే రోజుల్లో ఫ‌లితాన్ని ఇస్తుందా? లేదా అనేది వేచిచూడాలి.