Revanth Reddy : నిజాంకు పట్టిన గతే.. కల్వకుంట్ల కుటుంబానికి పడుతుంది : రేవంత్‌రెడ్డి

Revanth Reddy : నిరంకుశ నిజాంకు పట్టిన గతే.. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

  • Written By:
  • Updated On - November 19, 2023 / 05:59 PM IST

Revanth Reddy : నిరంకుశ నిజాంకు పట్టిన గతే.. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఎన్నికలు తుది దశ తెలంగాణ ఉద్యమం లాంటివని.. ఇందులో మీడియా ముందుభాగాన నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలని కోరారు. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలన్నారు. ‘‘ఈ ఉద్యమం పరిపాలన కోసం, అధికారం కోసం కాదు… తెలంగాణ ఆత్మగౌరవం కోసం. తెలంగాణ చరిత్ర చూస్తే.. ఆకలినైనా భరించింది కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. ఈ ఎన్నికల్లో ఆత్మగౌరవం కోసం తెలంగాణ ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు’’ అని రేవంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ‘తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.  ‘‘కేసీఆర్ ను ఓడించాలన్న కసితో బీసీలు ఉన్నారు. బీసీల ఓట్లను చీల్చి కేసీఆర్‌కు సహకరించడమే బీజేపీ వ్యూహం. 110 సీట్లలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని స్థితిలో ఉన్న బీజేపీ బీసీ నేతను సీఎంగా చేస్తామనడం ఓబీసీలను అవమానించడమే’’ అని టీపీసీసీ చీఫ్ చెప్పారు.

 

We’re now on WhatsApp. Click to Join.

‘‘ ఎస్సీ వర్గీకరణపై గతంలో బీజేపీ నేత వెంకయ్య నాయుడు సభ నిర్వహించి 100 రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. దానికే ఇప్పటిదాకా అతీగతి లేదు. బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా.. ఆ దిశగా బీజేపీ ఎందుకు చర్యలు చేపట్టడం లేదు ? దళితుల ఓట్లు కాంగ్రెస్‌కు పడకుండా చీల్చేందుకే.. ఈక్రమంలో కాలయాపన చేసేందుకే ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణపై కమిటీని ప్రకటించారు. మందకృష్ణకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. అఖిలపక్షంతో కలిసి ఢిల్లీకి వెళదాం… మోడీతో సమావేశమై ఆర్డినెన్స్‌కు కాంగ్రెస్ తరఫున  మద్దతు ప్రకటిస్తాను. ప్రభుత్వం అనుకుంటే 48 గంటల్లో ఆర్డినెన్స్ ఇవ్వొచ్చు. అబద్ధపు హామీలను నమ్మకుండా మందకృష్ణ కార్యాచరణ ప్రకటిస్తే ఆయనకు మద్దతుగా నిలుస్తాం’’ అని రేవంత్  తెలిపారు.  ‘‘ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్ష ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయి. అందుకే ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్ కు దుఃఖం వస్తోంది’’ అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించారు.

Also Read: Nizamabad Urban : ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సూసైడ్.. ఎందుకు ?

‘‘కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తుండు.. కేసీఆర్ విద్యుత్‌ను కొంటున్నది కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్ గడ్ నుంచి కాదా? సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేని కేసీఆర్ .. కాంగ్రెస్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు’’ అని రేవంత్ దుయ్యబట్టారు. కేసీఆర్ అవినీతిని నిలువరిస్తే రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాన్నయినా సంపూర్ణంగా అమలు చేయొచ్చని స్పష్టంచేశారు.  ‘‘కేసీఆర్ కు రైతు రుణమాఫీ చేయాలన్న చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.. అందులో అనుమానం లేదు’’ అని రేవంత్ తేల్చి చెప్పారు. ‘‘అధికారం కోల్పోతున్నామన్న ఆందోళనలో విచక్షణ కోల్పోయి కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత మాట్లాడుతున్నారు. ఆనాడు  సీమాంధ్ర పాలకులు మాట్లాడినట్లు ఇవాళ వాళ్లు మాట్లాడుతుండ్రు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం.. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం’’ అని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు.