తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Revanth Reddy Meets Rahul Gandhi )తో భేటీ అయ్యారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన రేవంత్, శనివారం మధ్యాహ్నం రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీ సోనియా గాంధీ నివాసం 10 జన్ పథ్‌లో దాదాపు గంట పాటు సాగింది. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.
Singer Mangli: నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదు.. స్పందించిన సింగర్ మంగ్లీ!
ఇటీవల తెలంగాణలో నిర్వహించిన కుల గణనపై రాహుల్‌కు రేవంత్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీసీల జనాభా అధికంగా ఉండటంతో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచే ప్రతిపాదనపై ఆయన అనుమతి కోరినట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పునర్వ్యవస్థీకరణ అంశంపై కూడా వీరిద్దరి మధ్య కీలక చర్చ జరిగింది. కొత్త నేతల నియామకం, రాష్ట్ర కమిటీని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై రాహుల్, రేవంత్ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వాయిదా పడిన తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అయితే రాహుల్ దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదని, మరో కొన్ని రోజులు వేచి చూడాలని సూచించినట్లు చెప్పినట్లు వినికిడి.
ఇటీవల టీపీసీసీ ఇంచార్జీగా దీపాదాస్ మున్షిని తొలగించిన కాంగ్రెస్ అధిష్ఠానం, ఆమె స్థానంలో మీనాక్షీ నటరాజన్‌ను నియమించింది. మీనాక్షీ రాహుల్ అత్యంత నమ్మకస్తురాలని, ఆమె సలహాలను పాటిస్తూ ముందుకు వెళ్లేలా చూడాలని రేవంత్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ భేటీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో రాహుల్ అపాయింట్‌మెంట్ పొందలేకపోయిన రేవంత్, ఈసారి ఢిల్లీ వెళ్లిన మరుసటి రోజే ఆయనతో భేటీ కావడం విశేషంగా మారింది. ఈ సమావేశం పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు దిశానిర్దేశం చేసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.