Revanth Reddy Vs Seniors : చక్రం తిప్పిన రేవంత్ .. ఢిల్లీలో ఏమయ్యందంటే ?

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) లో ఏర్పడిన కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) లో ఏర్పడిన కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్ లాయలిస్ట్ ల పేరుతో హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన కొందరు పార్టీలో జరుగుతున్న విషయాలతో పాటు రేవంత్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా విమర్శలు చేసారు. పీసీసీ ఏ కార్యక్రమం చేపట్టినా అసలు తమకు చెప్పకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఒంటెత్తు పోకడలతో వెళ్తున్నారని ఫైరయ్యారు. పార్టీ, రేవంత్ వ్యవహారాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేద్దామనుకున్న పార్టీ లాయలిస్టులు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఈ నెల 22 న ఢిల్లీ వెళ్లిన నేతలు సోనియాగాంధీ దగ్గరకు వెళ్లి రేవంత్ పై ఫిర్యాదు చేసి తమ బాధను చెప్పుకోవాలనుకున్నారు. కానీ ఢిల్లీ వెళ్లిన సీనియర్ నేతలు విహెచ్ ,సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. తాను ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తానని విహెచ్ బాహాటంగానే చెప్పినా కూడా ఇతర నేతలు ఎవరు కూడా తాము ఢిల్లీ వెళ్లినట్లు కనీసం సన్నిహితులకు కూడా చెప్పకుండా అంతా రహస్యంగా మెయింటైన్ చేశారు.

హైదరాబాద్ లో అనుకున్న విధంగా ఢిల్లీలో పరిస్థితులు లేవు. సోనియా గాంధీ అపోయింట్మెంట్ కోసం మూడు రోజులు ఉండి వెనుదిరిగారు.అధిష్టానం లాయలిస్టుల వాదన వినడానికి కూడా సిద్ధంగా లేదని గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. వర్గ కుమ్ములాటలు పక్కన పెట్టి అందరూ కలిసి పని చేయాలని సీనియర్లకు ఎఐసిసి(AICC) సూచించినట్లు తెలిసింది. ఢిల్లీ వెళ్లిన నేతలు కనీసం కేసి వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్ లను కూడా కలవలేకపోయారు. దీంతో ఢిల్లీ లో రేవంత్ చక్రం తిప్పాడని అర్ధం అవుతోంది.

అధిష్టానం లయాలిస్టులను కలవకుండా చేయడం, తనని వ్యతిరేకించే నేతల అదనపు బాధ్యతలు తొలగించడం లాంటి చర్యలతో రేవంత్ సీన్ ఏంటో అర్థమైపోయింది. అప్పటిదాకా అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామన్న నేతలు రాష్ట్రంలో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఎప్పుడు రేవంత్ పై ఒంటెత్తు కాలితో లేచి తాను పార్టీకి విధేయుడినని సోనియా రాహుల్ గాంధీలకు నమ్మినబంటు అని చెప్పుకునే ఓ కురువృద్ధ నేత సైతం ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదని ఆయన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేశారట. గతంలో చిన్న సమస్య వచ్చినా ఢిల్లీ వెళ్లి మేడంని కలిసే ఆ నేత మేడం అపోయింట్మెంట్ కోసం పడిగాపులు కాయాల్సి వచ్చిందట. ఇక తాను కలవడం వీలుకాక తిరిగి హైదరాబాద్ వచ్చానని ఢిల్లీ లో పిసిసి చక్రం తిప్పుతున్నాడని ఆయన ఎలా చెప్తే ఏఐసిసి లో ఉండే కొంతమంది నేతలు అలా వింటున్నారని ఆయన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేశారట. మొన్నటిదాకా నీ పని చెబుతామని, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఎగిరిపడ్డ నేతలు రేవంత్ కెపాసిటి అర్ధమై కొద్దికాలం మౌనంగా ఉంటే బెటర్ అనుకుంటున్నారట. ఇక ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు కలిసినడుస్తారా? నాలుగు రోజులు అయ్యాక సేమ్ సీన్ రిపీట్ అవుతుందా చూడాలి.