YS Sharmila : ష‌ర్మిల తొలి విజ‌యం

వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల్ గ్రాఫ్ పెరుగుతోంది. ఆమె పోరాటాన్ని ప్ర‌ధాన పార్టీలు గుర్తించే స్థాయికి చేరారు.

  • Written By:
  • Updated On - June 15, 2022 / 02:31 PM IST

వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల్ గ్రాఫ్ పెరుగుతోంది. ఆమె పోరాటాన్ని ప్ర‌ధాన పార్టీలు గుర్తించే స్థాయికి చేరారు. ఒకప్పుడు చీర‌, సారె వ‌ర‌కు ప‌రిమిత‌మంటూ విమ‌ర్శించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆమె ప్ర‌సన్నం కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. `బ‌చావో హైద‌రాబాద్` పేరుతో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ కు ష‌ర్మిల ను ఆహ్వానించారు. ప్ర‌త్యేకంగా ఫోన్ చేసి స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. అయితే.. త‌న పార్టీ త‌ర‌ఫున ప్ర‌తినిధిని స‌మావేశానికి పంపించారు ష‌ర్మిల‌.

పార్టీ ఆవిర్భావానికి ముందుగా ష‌ర్మిల తెలంగాణ స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేశారు. ఆ త‌రువాత వాటి మీద పోరాటానికి సిద్ధం అయ్యారు. రాజ‌న్న రాజ్యం తెలంగాణ‌కు అవ‌స‌ర‌మ‌ని నిన‌దించారు. ఆ దిశ‌గా వైఎస్ అభిమానుల‌తో ఆమె ఆత్మీయ స‌మావేశాల‌ను నిర్వ‌హించారు. వాటికి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి లాంటి వాళ్లు హాజ‌రు కావ‌డం అప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద హాట్ టాపిక్ అయింది. ప్ర‌తి మంగ‌ళ‌వారం నిరుద్యోగ దీక్ష‌కు ఆమె పూనుకున్నారు. ఆమె చేసిన ఒత్తిడి తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఆలోచింప చేసింది. ఫ‌లితంగా నోటిఫికేష‌న్ల‌ను ఇవ్వ‌డానికి కేసీఆర్ స‌ర్కార్ సిద్ధం అయింది.

రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌డానికి ఆమె వారంలో ఒక రోజును కేటాయించారు. ఆ పోరాటం ఉదృతం అవుతోన్న స‌మ‌యంలో కాంగ్రెస్, బీజేపీ కూడా వ‌రి కొనుగోలు అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చాయి. అప్ప‌టికే ష‌ర్మిల రైతు ప‌క్షాన ప్ర‌తి వారం ఒక జిల్లాను ఎంచుకుని ఉద్య‌మానికి దిగారు. దీంతో ఊపిరాడ‌ని కేసీఆర్ స‌ర్కార్ ఏకంగా మోడీ ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌ట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం జ‌రిగింది. ఆ క్ర‌మంలో రెండు పార్టీలు గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు పోరాటం చేసిన‌ప్ప‌టికీ స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. చివ‌ర‌కు కేసీఆర్ స‌ర్కార్ దిగొచ్చి వ‌రి ధాన్యం కొనుగోళ్ల‌ను ప్రారంభించింది. ఇదంతా మిగిలిన పార్టీల కంటే ముందు షర్మిల చేసిన ఉద్య‌మం ఫ‌లిత‌మే అనేది వైఎస్ఆర్టీపీ శ్రేణుల న‌మ్మ‌కం.

గ‌త ఏడాది తెలంగాణ వ్యాప్తంగా ఆమె పాద‌యాత్ర‌కు దిగారు. జ‌నం నుంచి పెద్ద‌గా స్పంద‌న తొలి రోజుల్లో క‌నిపించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ రెండో విడ‌త పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆమె పాద‌యాత్ర‌ను అనుసరించ‌డానికి జ‌నం సిద్ధం అవుతున్నారు. పైగా కేసీఆర్ పాల‌న మీద ఆమె ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్, బ‌ల‌మైన విప‌క్షంగా ఉన్న బీజేపీ చీఫ్ ల‌కు ఏ మాత్రం తగ్గ‌కుండా ష‌ర్మిల ప‌దునైన ప‌దాల‌తో కేసీఆర్ స‌ర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. యువ‌త ఇప్పుడిప్పుడే ఆమె వెంట న‌డుస్తున్నారు. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక‌డుగు ముందుకేసీ ష‌ర్మిల‌ను క‌లుపుకుని పోయే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

`రెడ్డి` సామాజిక‌వ‌ర్గానికి రాజ్యాధికారం అనే కోణం నుంచి రేవంత్ రెడ్డి వెళుతున్నారు. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల క‌ర్ణాట‌క వేదిక‌గా చెప్పిన విష‌యం విదిత‌మే. ఆ సామాజిక‌వ‌ర్గం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న పార్టీలుగా తెలంగాణ జ‌న‌స‌మితి, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు ఉన్నాయి. అందుకే, ఆ రెండు పార్టీల చీఫ్ లు ష‌ర్మిల, కోదండ‌రామిరెడ్డి అఖిల‌ప‌క్ష స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. బీఎస్పీ తెలంగాణ అధ్య‌క్షుడు ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మాత్రం రేవంత్ ఫోన్ కాల్ కు స‌న్నితంగా స‌మాధానం ఇస్తూ హాజ‌రు కాలేన‌ని చెప్పారట‌. మొత్తం మీద `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం పార్టీల స‌మావేశంగా అఖిల‌ప‌క్ష భేటీ మార‌నుంద‌ని అప్పుడే విమర్శ‌లు మొద‌లుకాగా, రేవంత్ ఫోన్ కాల్ అందుకున్న ష‌ర్మిల గ్రాఫ్ మాత్రం ఎంతోకొంత పెరిగింద‌ని ఆ పార్టీ భావించ‌డం `బ‌చావో హైద‌రాబాద్‌` ఎపిపోడ్ లోని హైలెట్‌.