Revanth Reddy : ఆ పేరు పలకడం ఇష్టం లేకనే.. దేశం పేరు మారుస్తున్నారు – రేవంత్ రెడ్డి

I.N.D.I.A కూటమి పేరు పలకడం ఇష్టం లేకనే దేశం పేరును భారత్ గా మారుస్తామని అంటున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 09:00 PM IST

ఎన్డీయే(NDA) హయాంలో దేశంలో దళితులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, జరుగుతున్న దారుణాలపై ప్రధాని మోదీ స్పందించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. కాంగ్రెస్(Congress) పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత్ జోడోయాత్ర(BHarat Jodo Yatra) ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా.. సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోడ్ లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వరకూ రేవంత్ రెడ్డి .. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. ఎన్డీయేపై ధ్వజమెత్తారు.

I.N.D.I.A కూటమి పేరు పలకడం ఇష్టం లేకనే దేశం పేరును భారత్ గా మారుస్తామని అంటున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, మణిపూర్ అంశాలపై ప్రధాని మోదీ పార్లమెంట్ లో చర్చించేందుకు ఇష్టపడటం లేదని విమర్శించారు. ప్రజల సమస్యల కంటే కాంగ్రెస్ ను తిట్టేందుకే ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఏం చేసిందన్న మోదీ.. గుజరాత్ లో మోదీ తిరుగుతున్న ఎయిర్ పోర్టు కాంగ్రెస్ హయాంలోనే నిర్మించబడిందన్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. నిజాం నవాబుల నుంచి తెలంగాణకు విముక్తినిచ్చింది కూడా కాంగ్రెస్సే అన్నారు.

బీజేపీ.. విభజించు, పాలించు అనే విధానంతో దేశాన్ని విడదీసే కుట్ర చేస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ సమగ్రతను కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేశారని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొడితే రాష్ట్రం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కారు ఢిల్లీకి వెళ్లి కమలంగా మారుతుందని, పైకి మాత్రం ఒకరినొకరు విమర్శించుకుంటారని రేవంత్ ఎద్దేవా చేశారు.

 

Also Read : Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తొలి వార్షికోత్సవం.. రాహుల్ కామెంట్స్..