Hyderabad Rains: తెలంగాణాలో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ రోడ్ల పరిస్థితి అధ్వన్నంగా మారింది. పేరుకే పెద్దనగరం.. వర్షం పడితే మాత్రం చిత్తడి అవుతున్న రోడ్లపై ప్రజలు నరకం చూస్తున్నారు. నగరవాసులు రోడ్లపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఇక వర్షం పడితే ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ గంటల కొద్దీ జామ్ అవుతుంది. దీంతో నగరవాసులు తమ ఇళ్లకు చేరాలంటే నరకం చూస్తున్నారు. హైదరాబాద్ ను డల్లాస్, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానని గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్ ను డల్లాస్, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేయడం కాదు నగరాన్ని మురికికూపంగా మార్చారని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు. ఓ వైపు వరదలతో నగర ప్రజలు అల్లాడిపోతుంటే, కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో బిజీ అయి ప్రజల సమస్యలను పట్టించులేదని దుయ్యబట్టారు. తెలంగాణ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. భారీ వర్షాలపై సమీక్ష చేయకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారని ఘాటైన విమర్శలు చేశారు.
తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు రేవంత్ రెడ్డి. చిన్న పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, వారిని ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపించొద్దని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో స్థానికులకు తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలవాలని సూచించారు. అవసరం అయితే సహాయక చర్యలు చేపట్టాలని రేవంత్ తమ పార్టీ కార్యకర్తలకి సూచించారు. ఇదిలా ఉండగా రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయి. అయితే ప్రభుత్వం సరైన విధంగా స్పందించి ప్రజలకు అందుబాటులో ఉండాలని లేనిపక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి.
Also Read: Hyper Aadi : హైపర్ ఆది కిడ్నాప్..