Revanth Reddy: ఉచిత విద్యుత్ పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలు అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రేవంత్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే బీఆర్ఎస్ తీరుపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా… మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల మాత్రమేనని ఎద్దేవా చేశారు. వచ్చేది కాంగ్రెస్… రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుంది.12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుంది. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచింది అని ఆరోపించారు రేవంత్ రెడ్డి.
Read More: CBN Fight : ఢిల్లీ వరకు చంద్రబాబు పోరుబాట