Revanth Reddy Journey: జడ్పీటీసీ నుంచి సీఎంగా రేవంత్ ప్రస్థానం

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలన సృష్టించారు అనుముల రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని జీరో నుంచి హీరో స్థాయికి చేర్చడంలో రేవంత్ రెడ్డి కృషి చేశారు. టీడీపీ ద్వారా తన రాజకీయం మొదలుపెట్టి 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఆషామాషీ కాదు.

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలన సృష్టించారు అనుముల రేవంత్‌ రెడ్డి(Revanth Reddy). కాంగ్రెస్ పార్టీని జీరో నుంచి హీరో స్థాయికి చేర్చడంలో రేవంత్ రెడ్డి కృషి చేశారు. టీడీపీ ద్వారా తన రాజకీయం మొదలుపెట్టి 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఆషామాషీ కాదు.

పదునైన మాటలతో ప్రత్యర్థులను విమర్శించడంలో దిట్ట. నిర్భయ ప్రసంగంతో దూకుడుగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడమే కాకుండా తెలంగాణలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇది ఒక చారిత్రాత్మక అంశంగా పరిగణించవచ్చు. జెడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ ఇప్పుడు సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు.

రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డి పల్లిలో జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబం. రేవంత్ గ్రాడ్యుయేషన్ సమయంలో ఏబీవీపీ విద్యార్థి విభాగంలో విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. ఏవీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లు ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేసినట్లు సన్నిహితులు చెప్తున్నారు. 2004లో టీడీపీలో చేరిన రేవంత్.. 2006లో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ జెడ్పీటీసీ నుంచి పోటీ చేశారు. టీడీపీ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2008లో ఉమ్మడి ఏపీ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచి ఆశ్చర్యపరిచారు. అనంతరం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోటీడీపీ అభ్యర్థిగా కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మళ్లీ 2014లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఫ్లోర్‌లీడర్‌గానూ పనిచేశారు.

ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన 2017 అక్టోబరులో కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీలో చురుగ్గా వ్యవహరించి.. స్వల్ప వ్యవధిలోనే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని అందుకొన్నారు. కాంగ్రెస్‌కు మళ్లీ జీవంపోసే ప్రయత్నం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి ఓడిపోయినా.. 2019లో కాంగ్రెస్ నుంచి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన ఆయన.. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. 119 స్థానాలకు గానూ 64 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం రేవంత్ సీఎం రేసులో ఉండగా.. సాయంత్రంలోగా సీఎం ఎవరన్నది తేలిపోనుంది.

Also Read: Mizoram CM : మిజోరం సీఎం ఓటమి.. కొత్త సీఎంగా జెడ్‌పీఎం చీఫ్

Follow us