Revanth Strategic Plan: ‘మూడ్ ఆఫ్ మునుగోడు’.. రేవంత్ ఆప్షన్స్ ఇవే!

మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ కూడా వెలువడలేదు.

  • Written By:
  • Updated On - September 3, 2022 / 12:49 PM IST

మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ కూడా వెలువడలేదు. అయినా మునుగోడు రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో విధంగా గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటు అయిన మునుగోడుని ఎలాగైనా గెలుచుకోవాలని చెప్పి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే కష్టపడుతున్నారు. ఇప్పటివరకు తమని ప్రజలు ఆదరించలేదని, రెండు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని, మరో రెండు చోట్ల బీజేపీని గెలిపించారని, అయినా సరే ప్రజలకు ఒరిగింది ఏమి లేదని, కాబట్టి ఈ ఒక్కసారి మాకు ఓటు వేయాలని రేవంత్..మునుగోడు ప్రజలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక మునుగోడు టార్గెట్ గా రేవంత్ ప్రచారం మొదలుపెట్టనున్నారు…కాంగ్రెస్ సీనియర్లు కూడా పార్టీలోని అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే అంతా బాగానే ఉంది గాని..రాజకీయంగా ముందున్న టీఆర్ఎస్, బీజేపీలని దాటుకుని కాంగ్రెస్ గెలిస్తే…అదొక అద్భుతం..కానీ మునుగోడులో అలా జరిగే పరిస్తితి కనిపించడం లేదు. అలా అని మునుగోడులో కాంగ్రెస్ బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. గట్టిగా కష్టపడితే ఆ పార్టీ గెలిచేస్తుంది.

ఇప్పుడున్న పరిస్తితులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అంతగా అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు టీఆర్ఎస్, బీజేపీ వైపు వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్తితుల్లో రేవంత్ రెడ్డి మూడు ఆప్షన్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అదేంటి ఏంటి..గట్టిగా పోరాడితే విజయం దక్కుతుందని అనుకుంటే…విజయం దిశగానే పనిచేయాలని భావిస్తున్నారట.ఒకవేళ గెలుపు దగ్గరకు వచ్చి ఆగిపోతుందనుకుంటే…కనీసం రెండోస్థానం తెచ్చుకుంటే కనీసం పరువు దక్కుతుందనేది రెండో ఆప్షన్. ఇక మూడో ఆప్షన్ ఏంటంటే…విజయం దక్కదు…రెండో స్థానం రాదు అనుకుంటే…కోమటిరెడ్డి రాజగోపాల్ ఓటమి కోసం పనిచేయాలనేది టార్గెట్ అని తెలుస్తోంది. అవసరమైతే కాంగ్రెస్ ఓట్లని చివరి నిమిషంలో టీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయ్యేలా కూడా చేయొచ్చని కథనాలు వస్తున్నాయి. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ చెక్ పెట్టడానికి కారణం…అక్కడున్న కాంగ్రెస్ ఓట్లు ఈటల రాజేందర్‌కు షిఫ్ట్ అయ్యాయి. అందుకే అక్కడ కాంగ్రెస్‌కు 3 వేలు ఓట్లు మాత్రమే వచ్చాయి. మరి అదే ఫార్ములా రివర్స్‌లో మునుగోడులో బీజేపీ అభ్యర్ధిగా నిలబడుతున్న కోమటిరెడ్డికి చెక్ పెట్టడానికి వాడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి చూడాలి మునుగోడులో రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో.