Site icon HashtagU Telugu

Revanth Reddy and Jagga Reddy: అంద‌రికీ భ‌లే షాక్ ఇచ్చారే.. ఇక ప్ర‌త్య‌ర్ధుల‌కు చుక్క‌లేనా..?

Revanth Reddy And Jagga Reddy

Revanth Reddy And Jagga Reddy

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌లు అయిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిల మ‌ధ్య గ‌త కొద్ది రోజులుగా సైలెంట్ వార్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌లు వేదిక‌ల పై రేవంత్ రెడ్డిపై జ‌గ్గారెడ్డి ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు కూడా చేశారు. అయితే ఒకే పార్టీలోనే ఉన్నా ఉప్పు నిప్పులా ఉంటున్న ఈ ఇద్ద‌రు నాయ‌కులు, తాజాగా తెలంగాణ అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీస్‌లో క‌లిసి, చేతులు క‌లిపి ఫొటోల‌కు ఫోజులు ఇచ్చారు.

ఈ నేప‌ధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు చేతులు క‌ల‌ప‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అవుతుంద‌ని మీడియా ప్ర‌తినిథులు రేవంత్ రెడ్డిని ప్ర‌శ్నించ‌గా, త‌మ మ‌ధ్య ఎలాంటి విబేధాలు లేవ‌ని, ఇదంగా మీడియా క్రియేట్ చేసిన ప్ర‌చార‌మే అని రేవంత్ రెడ్డి అన్నారు. మ‌రోవైపు జ‌గ్గారెడ్డి స్పందిస్తూ.. విడాకులు తీసుకున్నాక మ‌ళ్ళీ క‌లిస్తే త‌ప్ప‌ని, అయితే తాము ఇప్ప‌టి వ‌ర‌కు విడాలుకు తీసుకోలేద‌ని జ‌గ్గారెడ్డి త‌న‌దైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు.

తెలంగాణ అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీస్‌లో ఈ ఇద్ద‌రు ఇద్దరు నేతలు దాదాపు 20 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యి, కొన్ని కీల‌క విష‌యాలు చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. దీంతో రేవంత్ అండ్ జ‌గ్గారెడ్డిల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్య‌ల‌పై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇదే అంశంపై జగ్గారెడ్డిని మీడియా ప్ర‌తినిథులు ప్ర‌శ్నలు ఎదుర‌య్యాయి. అయితే తాము సమావేశంలో ఏం మాట్లాడుకున్నామనే విషయాన్ని బహిర్గతం చేయబోనని జ‌గ్గారెడ్డి స్పష్టం చేశారు.

ఇక ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతల వ్యవహార శైలిపై సీనియ‌ర్ నాయ‌కుడు జగ్గారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటీవల ఆయ‌న‌ పార్టీని కూడా వీడుతానని ప్రకటించారు. అంతేకాకుండా మెదక్‌ జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటన పై జగ్గారెడ్డి ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు. కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వ‌కుండా నియోజ‌క‌వ‌ర్గంలో రేవంత్ రెడ్డి ఎలా ప‌ర్య‌టిస్తార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలియ‌జేసి అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఈ నేప‌ధ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో కుదుపులు త‌ప్ప‌వ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలతో పాటు విశ్లేష‌కులు కూడా అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఒక‌వైపు అధికార టీఆర్ఎస్ పై రాష్ట్ర ప్ర‌జ‌ల్లో కొంత వ్య‌తిరేక‌త ఉన్నా కేసీఆర్ మాట‌ల గార‌డీతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఒడ్డున ప‌డుతుంద‌ని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. మ‌రోవైపు బీజేపీ కూడా రాష్ట్రంలో క్ర‌మంగా పుంజుకుంటుంది. ఇటీవ‌ల తెలంగాణ‌లో జ‌రిగిన ఉపఎన్నిల్లో విజ‌యం సాధించి రాష్ట్రంలో కాషాయం జెండా పాత‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఇక ఎటు చూసినా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రంలో క్ర‌మ‌క్ర‌మంగా క‌నుమ‌రుగ‌వుతోంది.

అలాగే సొంత పార్టీ నేత‌ల మ‌ధ్య విబేధాలు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకంజ‌లో ఉండ‌డానికి మ‌రో కార‌ణం అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఏదో ఒక మ్యాజిక్ జ‌రిగితే త‌ప్ప తెలంగాణ‌లో కాంగ్రెస్ నిల‌బ‌డే చాన్స్ లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా అంద‌రికీ షాక్ ఇస్తూ రేవంత్ రెడ్డి అండ్ జ‌గ్గారెడ్డిలు ఆత్మీయంగా ప‌ల‌క‌రించుకోవ‌డం తెలంగాన రాజ‌కీయాల్లో ఇంట్ర‌స్టింగ్‌గా మారింది. ఇక ఈ ఇద్ద‌రు కీల‌క నేత‌ల క‌ల‌యిక‌పై టీ కాంగ్రెస్ వ‌ర్గాలు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా కాంగ్రెస్ శ్రేణులు జోష్ పెరుగుతుందో లేదో చూడాలి.