తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) ఆదివారం వనపర్తిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపాయి. మోదీ తెలంగాణ పట్ల సానుకూలంగా ఉన్నారని అభిప్రాయపడిన రేవంత్, కిషన్ రెడ్డి మాత్రం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
Mega DSC : మెగా డిఎస్సీపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
ప్రధాని మోదీపై రేవంత్ ప్రశంసలు గుప్పిస్తూ.. తెలంగాణ అభివృద్ధికి మోడీ ఆసక్తి చూపిస్తున్నారని, ప్రత్యేకంగా వరంగల్ ఎయిర్ పోర్టు మంజూరును ఉదహరిస్తూ, మోదీ రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని, ఆయన సానుభూతి తెలంగాణపై ఉందని రేవంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి మద్దతు లభిస్తే, రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయన తెలిపారు.
అయితే, మోదీ తెలంగాణకు చేయాలనుకున్న పనులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉంటూ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలిపివేయడం, అభివృద్ధి ప్రాజెక్టులను విఫలమయ్యేలా చేయడం కిషన్ రెడ్డి కుయుక్తి అని అన్నారు. ముఖ్యంగా వరంగల్ ఎయిర్ పోర్టును మోదీ ఇచ్చినప్పటికీ, దాన్ని తన విజయంగా చిత్రీకరించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. అదే సమయంలో మెట్రో రైలు విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్ కోసం నిధులు తేవడంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారని రేవంత్ విమర్శించారు.
రేవంత్ తన రాజకీయ ప్రయాణంలో ఒకదశలో కిషన్ రెడ్డితో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, తన ఎదుగుదలను కిషన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తాను తనకంటే చిన్న వయసులో సీఎం అయ్యారనే అసూయతో కిషన్ రెడ్డి రాష్ట్రానికి మేలు చేసే పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మోదీని తెలంగాణకు మిత్రుడిగా అభివర్ణించిన రేవంత్, అదే సమయంలో కిషన్ రెడ్డిని రాష్ట్రానికి శత్రువుగా చిత్రీకరించడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.