తెలంగాణ అసెంబ్లీ వేదికగా సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చ, తదనంతర రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీశాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసిరి ఆ తర్వాత అసెంబ్లీ నుండి వెళ్లిపోవడం ఇప్పుడు చర్చ గా మారింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) డిజైన్ మార్పు, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ తొలుత ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమంటూ సవాలు విసిరినప్పటికీ, తీరా సమావేశాలు ప్రారంభమయ్యాక మాజీ సీఎం కేసీఆర్ కేవలం రెండు నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెనుదిరగడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ప్రభుత్వం పక్కా ఆధారాలతో, గత పదేళ్లలో జరిగిన తప్పులను ఎండగడుతుండటంతో, తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే బీఆర్ఎస్ సభను బహిష్కరించిందని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా జూరాల నుండి శ్రీశైలం దిగువకు ప్రాజెక్టును మార్చడం వల్ల జరిగిన నష్టంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కడిగిపారేయడంతో ప్రతిపక్షం డిఫెన్స్‌లో పడిపోయింది.
Cm Revanth Speech Assembly
అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన వివరణకు కౌంటర్‌గా హరీశ్ రావు పార్టీ కార్యాలయంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆశించిన స్థాయిలో లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. తాము స్వయంగా సవాలు చేసిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలపై కంటే, ఇతర ప్రాజెక్టుల ప్రస్తావన తెచ్చి విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే కేసీఆర్ అంగీకరిస్తూ సంతకం చేసిన విషయాన్ని గానీ, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై గానీ హరీశ్ రావు సహేతుకమైన వివరణ ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులను విమర్శించబోయి, తిరిగి అవే ప్రాజెక్టుల ద్వారా కాళేశ్వరానికి నీరు వస్తోందని చెప్పడం ఆయన వివరణలోని డొల్లతనాన్ని బయటపెట్టిందని ప్రభుత్వం ఎద్దేవా చేస్తోంది.
ప్రభుత్వాన్ని ఇరుకున పెడతామని భావించిన బీఆర్ఎస్ శ్రేణులు, క్షేత్రస్థాయిలో చర్చకు నిలబడలేక సభను బహిష్కరించడం పట్ల తీవ్ర నిరాశలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం అధికారిక గణాంకాలతో పారదర్శకంగా ప్రజల ముందు వాస్తవాలను ఉంచడంతో, బీఆర్ఎస్ వాదనలు బలహీనపడ్డాయి. కాళేశ్వరం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడమే కాకుండా, సొంత పార్టీ శ్రేణుల్లోనే అసహనాన్ని పెంచాయి. ముఖ్యంగా కీలకమైన సమయంలో కేసీఆర్ సభలో లేకపోవడం పార్టీ పట్టును కోల్పోతోందనే సంకేతాలను ఇస్తోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర సాగునీటి రాజకీయాల్లో రేవంత్ రెడ్డి మార్క్ దూకుడుకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి.
