తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న బదిలీల (Transfers) ప్రక్రియపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో నెం. 38ను విడుదల చేసింది. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది.
బదిలీల నిబంధనలు: ఎవరికి అర్హత?
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఒకే చోట మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, ఒకే ప్రాంతంలో నాలుగేళ్లు పూర్తి చేసిన వారికి తప్పనిసరిగా (Compulsory) బదిలీలు ఉంటాయి. పారదర్శకత కోసం బదిలీలను పూర్తిగా ఆన్‌లైన్ లేదా వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేడర్‌లో గరిష్ఠంగా 40 శాతం మందికి మాత్రమే బదిలీలు ఉంటాయని, తద్వారా పరిపాలనలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మే 31తో ఈ ప్రక్రియ ముగియనుండగా, జూన్ 1వ తేదీ నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమలులోకి వస్తుంది.
బదిలీల ప్రక్రియలో మానవీయ కోణం
బదిలీల ప్రక్రియలో మానవీయ కోణానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. భార్యాభర్తలు (Spouse cases), వికలాంగులు మరియు తీవ్రమైన అనారోగ్య సమస్యలు (క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, హృదయ శస్త్రచికిత్సలు) ఉన్న వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాగే, కష్టతరమైన ప్రాంతాల్లో (Hardship areas) ఎక్కువ కాలం పనిచేసిన వారికి వారు కోరుకున్న చోటికి వెళ్లేందుకు ప్రాధాన్యం ఉంటుంది. మరోవైపు, 21 మే 2027 నాటికి పదవీ విరమణ పొందే ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఊరట కల్పించింది.
