Talasani Srinivas Yadav: రేవంత్, ఈటెల అతిగా ఊహించుకుంటున్నారు, అధిష్టానం మెప్పు కోసమే కేసీఆర్ పై పోటీ!

రెండు సీట్లు కూడా గెలవని BJP BC ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి తలసాని అన్నారు.

  • Written By:
  • Publish Date - November 11, 2023 / 05:44 PM IST

Talasani Srinivas Yadav: పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి తన బాష మార్చుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. శనివారం తెలంగాణ భవన్ లో నగరానికి చెందిన MLA లు, MLA అభ్యర్ధులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సికింద్రాబాద్ MLA అభ్యర్ధి, శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, MLA లు మాగంటి గోపినాద్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నాంపల్లి, కంటోన్మెంట్, గోషా మహల్ MLA అభ్యర్ధులు ఆనంద్ గౌడ్, లాస్య నందిత, నంద కిషోర్ వ్యాస్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాల లో జరుగుతున్న ప్రచార సరళి, ఈ నెల 17 నుండి జరిగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో, 25 వ తేదీన జరిగే ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పై చర్చించారు.

అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నోటికి అడ్డు అదుపూ లేని ఒక మూర్ఖుడిని పిసిసి అద్యక్షుడిగా నియమించిందని విమర్శించారు. ఉన్నత పదవులలో ఉన్న వారిపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందిచక పోవడం విచారకరం అన్నారు. తాము అంతకంటే ఎక్కువగా మాట్లాడగలమని, మాకు సంస్కారం అడ్డు వస్తుందని చెప్పారు. ప్రజలు కూడా గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మీ పార్టీ ఎన్నికల ప్రచారంలో మీ విధానాల పై ప్రజలకు వివరించాలే కానీ పరుష పదజాలం ఉపయోగించడంపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించాలని చెప్పారు. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ లు తమను తాము అతిగా ఊహించుకుంటున్నారని, తమ తమ నియోజకవర్గాలలో ఓడిపోతామని తెలిసి తమ పార్టీ అధిష్టానాల మెప్పు కోసం ముఖ్యమంత్రి పై పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఒడి పోతాననే భయంతోనే రాష్ట్ర BJP అద్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గంలో పోటీకి దూరం గా ఉన్నారని విమర్శించారు. రెండు సీట్లు కూడా గెలవని BJP BC ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

25 న ముఖ్యమంత్రి బహిరంగ సభ, 17 నుండి KTR రోడ్ షో

ఈ నెల 25 వ తేదీన నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్య అతిధిగా హాజరవుతారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అదేవిధంగా ఈ నెల 17 వ తేదీ నుండి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అన్ని నియోజకవర్గాలలో రోడ్ షో నిర్వహిస్తారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి గా ఉండటం వలన గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేశామని వివరించారు. మినీ ఇండియా గా పిలుచుకొనే హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఎంతో అభివృద్ధి చేసిందని వివరించారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు పట్టం కడతారని, తిరిగి రాష్ట్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాదిస్తామని తెలిపారు. గ్రేటర్ లో అన్ని స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టో లో చెప్పిన కార్యక్రమాలే కాకుండా చెప్పనివి కూడా చేసిన ఘనత తమకే దక్కుతుందని అన్నారు.

సొంత ఇల్లు లేని పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. GHMC పరిధిలో ఇప్పటి వరకు లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టి 70 వేల ఇండ్లను అర్హులకు ఇచ్చామని, మరో ౩౦ వేల ఇండ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. SNDP కార్యక్రం ద్వారా నాలాల ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేశామని వివరించారు. అదేవిధంగా రోడ్ల అభివృద్ధి, అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్ ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. మరో లక్ష ఇండ్లను నిర్మిస్తామని మేనిఫెస్టో లో ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లో బిసి డిక్లరేషన్, గ్యారెంటీ లు అంటూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన నాయకులు ప్రకటిస్తున్నారని, అవి అమలు కాకుంటే ప్రజలు ఎవరిని అడగాలని అన్నారు.

Also Read: TTD: హాట్‌ కేకుల్లా అమ్ముడైన టీటీడీ టికెట్స్, 20 నిమిషాల్లో 2.25 లక్షల ఆదాయం!