TS Change TG : అందుకోసమే టీఎస్‌ను టీజీగా మార్చాల్సి వచ్చింది – రేవంత్‌రెడ్డి వివరణ

  • Written By:
  • Updated On - February 5, 2024 / 02:40 PM IST

నిన్నటి కేబినెట్ సమావేశంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు, ప్రస్తుతం టీఎస్‌గా ఉన్న వాహన రిజిస్ట్రేషన్‌ కోడ్ టీజీ (TG)గా మార్పు, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమేనని, దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ‘జయహే తెలంగాణ’ను అధికారిక గీతంగా మార్చాలని నిర్ణయించుకున్నామని, తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక పోకడలు లేకుండా సగటు రాష్ట్ర అడవిబిడ్డ రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. వాహన రిజిస్ట్రేషన్ లో టీఎస్ కాకుండా టీజీగా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష అని, ఉద్యమ సమయంలో వారు అలాగే నినదించారని తెలిపారు. వారి ఆంకాక్షలను నెరవేరుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాహన రిజిస్ట్రేషన్లలో ఇప్పటిరకు నెంబరుకు ముందు రాష్ట్రం పేరును సూచించేలా టీఎస్ (TS) అనే అక్షరాలు ఉండేవి. ఇప్పుడు ‘టీఎస్’ అనే అక్షరాలు కనుమరుగు కానున్నాయి. టీఎస్ స్థానంలో ఇకపై టీజీ (TG) అనే అక్షరాలు రానున్నాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, పలు కీలక నిర్ణయాలకు నేటి క్యాబినెట్ సమావేశం వేదికగా నిలిచింది. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ను ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ ఆత్మ, స్ఫూర్తి ప్రతిబింబించేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. ఆరు గ్యారెంటీలపై లోతుగా చర్చించిన అనంతరం రెండు గ్యారెంటీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను అమలు చేయాలని నిర్ణయించారు.