Site icon HashtagU Telugu

KTR : ఈ ఒక్క ఓటమి ఎలాంటి ప్రభావం చూపదు : మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నికను రిచెస్ట్ ఎన్నికగా భావించారు రాజకీయ విశ్లేషకులు. అందరూ భావించినట్టుగానే ఈ ఉప ఎన్నికలో డబ్బు, మద్యం ఏరులై పారింది. ముఖ్యంగా ఈటల ఓడించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది. కేసీఆర్ పై ధిక్కారస్వరం వినిపించారనే ఆరోపణలతో ఈటలను పార్టీ నుంచి తొలగించడం.. ఈటల టీఆర్ఎస్ గుడ్ బై చెప్పడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో ఈటల ఘన విజయం సాధించారు. ఈ విజయం కేసీఆర్ కు చెంపపెట్టులాంటిదని ఈటల పేర్కొన్నారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోవడం ఆ పార్టీకి నాయకులకు తీవ్ర నిరాశకు గురిచేసింది. దళిత బంధు ప్రకటించినా.. డబ్బులు వెదజల్లినా టీఆర్ఎస్ నాయకుల పాచిక పారలేదనే పలువురు నాయకులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫ్రాన్స్ పర్యటనలో కేటీఆర్, “గత 20 ఏళ్లలో టీఆర్‌ఎస్ ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిందని, ఈ ఉప ఎన్నికల ఫలితం అంతగా ప్రాముఖ్యతను సంతరించుకోదు’’ అని ట్వీట్ చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని, భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలంతా మరింత దృఢ సంకల్పంతో పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రచారానికి నాయకత్వం వహించిన మంత్రులు టి.హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌తోపాటు హుజూరాబాద్‌లో గెలుపు కోసం కృషి చేసిన టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు, పార్టీ నాయకులు, క్యాడర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రచారంలో అలుపెరగని కృషి చేసిన సోషల్ మీడియా యోధులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఉప ఎన్నిక ఓటమిపై ట్రబుల్ షూటర్ హరీశ్ రావు కూడా స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నో గెలుపోటములు చవిచూసిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రెండు జాతీయ పార్టీలను తట్టుకొని నిలబడిందని, నైతిక విజయం మాత్రం టీఆర్ఎస్ దేేనని ఆయన అన్నారు.