Uttam Kumar Reddy : సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడి వందల ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. పరిసర గ్రామాలను వరద ముంచెత్తింది. దీంతో గండి పడిన ప్రదేశాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, చీఫ్ ఇంజినీర్ రమేశ్ బాబు, సూపరింటెండింగ్ ఇంజినీర్ సాయి ధర్మతేజతో కలిసి పరిశీలించారు. కాలువకు గండి పడిందని తెలిసిన వెంటనే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు చెందిన హెడ్ రెగ్యులేటర్‌ను మూసేశామని ఈసందర్భంగా అధికారులు మంత్రి ఉత్తమ్‌కు తెలిపారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడిన చోట పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలను అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. వారంలోగా ఈ పనులను పూర్తి చేసి, నీటి సరఫరా యధావిధిగా జరిగేలా చూస్తామని ఆయన వెల్లడించారు. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
అన్నదాతలు నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం తప్పకుండా అందుతుందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. నీటి మునిగి నష్టపోయిన పంట పొలాల వివరాలను అధికారుల ద్వారా సేకరించి.. వాటి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి పంట నష్ట పరిహారాన్ని అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 300 ఎకరాల మేరకు పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారని తెలిపారు. అధికారులు మళ్లీ క్షేత్రస్థాయిలో పర్యటించి, పూర్తి స్థాయి నష్టంపై స్పష్టమైన గణాంకాలను తయారు చేస్తారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
‘‘గత రెండు రోజులుగా కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని విధంగా వర్షాలు కురిశాయి. పాలేరు రిజర్వాయర్ నుంచి బ్యాక్ వాటర్ ముంచెత్తడంతో నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నీటి ప్రవాహం పెరిగింది. కట్ట పై నుంచి నీరు ప్రవహించడంతో అది మెత్తపడి కోతకు గురై గండి పడింది’’ అని మంత్రి ఉత్తమ్ వివరించారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.