Minister Uttam: కృష్ణా, గోదావరి నదీ జల విభజనలో తెలంగాణ ఎదుర్కొంటున్న లాంఛన సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌కు లేఖ రాశారు. జూన్ 19న న్యూఢిల్లీలో జరిగిన సమావేశం తర్వాత కూడా కీలక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కేంద్రం తక్షణంగా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
“ఈ సమస్యలు పరిష్కరించకపోతే రైతులకు నీటి సౌకర్యం అందక, పేద ప్రాంతాల్లో సాగు అభివృద్ధి దెబ్బతింటుంది” అని మంత్రి లేఖలో పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలకు కేంద్ర జల సంఘం (CWC) అనుమతులు ఇంకా రాకపోవడం, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ నుండి ‘నో-ఆబ్జెక్షన్’ సర్టిఫికేట్ ఆలస్యం కావడం వంటి అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్‌పై ఆరోపణలు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ అనధికారికంగా శ్రీశైలం జలాశయం నుండి భారీగా నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లిస్తోందని ఆరోపించారు. ఇది తెలంగాణలో సాగు, విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే, కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II (KWDT-II) విచారణను త్వరగా ముగించాలని, కృష్ణా జలాలను 71:29 నిష్పత్తిలో పంచుకోవాలని తెలంగాణ స్టాండ్‌ను స్పష్టం చేశారు.
Also Read: Nurse Nimisha Priya: యెమెన్‌లో మరణశిక్ష ఎలా అమలు చేస్తారు? గుండె దగ్గర కాల్పులు జరుపుతారా?
ఇతర విజ్ఞప్తులు
- టెలీమెట్రీ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేయడం.
- శ్రీశైలం డ్యాం మరమ్మతులను వేగవంతం చేయడం.
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సమర్థన.
- గోదావరి-కావేరి అనుసంధానంలో ఇంచంపల్లి ప్రాజెక్టుకు సమాన సహాయం.
తెలంగాణకు న్యాయం కోరుతూ..
“తెలంగాణ చరిత్రపరంగా నీటి వనరులలో అన్యాయానికి గురైంది. కేంద్రం ఇప్పటికైనా జోక్యం చేసుకుని, రైతులకు న్యాయం చేయాలి” అని మంత్రి ఉత్తమ్ లేఖలో విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర జలశక్తి మంత్రిని కోరారు.