TRS Resignation Rumours: టీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న ‘రాజీనామాల రూమర్స్’

టీఆర్‌ఎస్‌ నేతలు ఇతర పార్టీల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

  • Written By:
  • Updated On - October 18, 2022 / 01:00 PM IST

టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆయా నేతలు రాజీనామాలు చేస్తున్నారు? అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ముఖ్య నేతలు ‘పుకార్లను’ కొట్టిపారేయడానికి క్లారిటీ ఇవ్వాల్సివస్తోంది. ముఖ్యంగా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీకి రాజీనామా చేయడంతో.. టీఆర్‌ఎస్ ఇతర నేతలు పార్టీని వీడాలని యోచిస్తున్నట్లు అనే వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ కూడా బూర నర్సయ్య గౌడ్‌ బాటలోనే నడుస్తారు అనే వార్త కూడా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే, మరుసటి రోజే మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కన కనిపించి పుకార్లకు చెక్ పెట్టారు కర్నె ప్రభాకర్. మరో టీఆర్‌ఎస్‌ నేత, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి కూడా బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన పేరు కూడా మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై భువనగిరి ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. పార్టీని వీడే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పాడు. చివరకు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా వివరణ ఇచ్చారు.

తాను పార్టీని వీడుతున్నానన్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లో పూర్తిగా తప్పుడు, నిరాధారమైన వార్తలు హల్‌చల్ చేస్తున్నాయని, దీని వెనుక ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పద్మారావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి సైతం ఇతర పార్టీలో చేరుతారనే వార్తలు ఎప్పట్నుంచో హల్ చల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అనుచరులకు, పార్టీ హైకమాండ్‌కు కూడా స్పష్టమైన సందేశం పంపేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పార్టీ నేతలు. ఇలాంటి ప్రతికూల వార్తలతో పార్టీ అధినేత దృష్టిలో తమ పరువు పోతుందని టీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారు. అందుకే క్లారిటీ ఇస్తున్నారని టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త ఒకరు మీడియాకు తెలిపారు.