తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి (Renuka Chowdhury) చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు. మాటలకన్నా చేతలే ముఖ్యం అనే స్థాయికి రేవంత్ రెడ్డి ఎదిగారని, ఈ నిర్ణయం రాజకీయ నిర్ణయం కాదని, సామాజిక న్యాయానికి నాంది పలికే పెద్ద అడుగుగా భావించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ రిజర్వేషన్ బిల్లు మారబోతోందని, ప్రజలు గర్వపడే రోజులు వచ్చాయని ఆమె అభిప్రాయపడ్డారు.
12 Jyotirlingas : 12 జ్యోతిర్లింగాల దర్శనానికి ఒకే స్థలం..ఎక్కడో తెలుసా?
బీసీలకు ఉద్యోగాలు, రాజకీయాల్లో మెరుగైన అవకాశాలు కల్పించేలా ఈ బిల్లు దోహదం చేస్తుందని, ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోందని రేణుకా పేర్కొన్నారు. పలు రాష్ట్రాల నుంచి ప్రజలు, కార్యకర్తలు ఆమెకు మెసేజ్‌లు పంపిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారనీ, కాంగ్రెస్ మాత్రమే ఇలాంటి కీలకమైన సామాజిక న్యాయాన్ని అమలు చేయగలదని చెప్పారు. గతంలో రాజీవ్ గాంధీ మహిళల పక్షాన తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో బీసీలకు అన్యాయం తీరేలా చరిత్ర సృష్టించారని ఆమె పేర్కొన్నారు.
ఇదే సందర్బంగా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు రేణుకా చౌదరి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎద్దేవా చేస్తూ “కవిత ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది” అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మారుస్తూ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఆ పార్టీలో గ్రూపులు ఉన్నాయి, ప్రజలకు చేసేదేమీ లేదని విమర్శించారు. ఇప్పుడైనా రాష్ట్రానికి నిజమైన సీఎం లభించారని పేర్కొంటూ రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుందని స్పష్టం చేశారు.