Renuka Chowdary: ఎస్ ఐ కాల‌ర్ ప‌ట్టుకున్న రేణుకా చౌద‌రి

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకాచౌద‌రి తెలంగాణ పోలీసుల చొక్కా ప‌ట్టుకున్నారు.

  • Written By:
  • Updated On - June 16, 2022 / 03:11 PM IST

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకాచౌద‌రి తెలంగాణ పోలీసుల చొక్కా ప‌ట్టుకున్నారు. ఆమెను అరెస్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేసిన ఎస్ ఐ కాల‌ర్ ప‌ట్టుకుని నిల‌దీశారు. రాహుల్ పై ఈడీ విచార‌ణ‌ను నిర‌సిస్తూ దేశ వ్యాప్తంగా రాజ్ భ‌వ‌న్ల ముట్టిడికి ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేర‌కు తెలంగాణ రాజ్ భ‌వ‌న్ ముట్ట‌డి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఆ సంద‌ర్భంగా ప‌లువురు కాంగ్రెస్ లీడ‌ర్ల‌తో పాటు క్యాడ‌ర్ ను అదుపు చేయ‌డానికి పోలీసులు ప్ర‌య‌త్నం చేశారు. రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద బైక్ ను త‌గుల‌బెట్ట‌డం, బ‌స్సు అద్దాల‌ను ధ్వంసం చేయ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. దీంతో పోలీసులు, కాంగ్రెస్ లీడ‌ర్ల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.

ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు క్యాడ‌ర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సంద‌ర్భంగా మాజీ మంత్రి రేణుకా చౌద‌రిని అదుపులోకి తీసుకునే ప్ర‌య‌త్నం పోలీసులు చేశారు. ఆమె వ‌ద్ద మ‌హిళా పోలీసులు ఉన్న‌ప్ప‌టికీ పురుషులు జోక్యం చేసుకోవ‌డంతో ఆగ్ర‌హంతో ఊగిపోయారు. అంతేకాదు, ఆమెను అదుపులోకి తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన యువ ఎస్ ఐ చొక్కా ప‌ట్టుకుని గుంజారు. అత‌నికి వార్నింగ్ ఇస్తూ మ‌హంకాళిలా కొద్దిసేపు మారిపోయారు. దీంతో అక్క‌డే ఉన్న మ‌హిళా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఐదు నిమిషాల పాటు మాజీ మంత్రి రేణుకా చౌద‌రి ఆగ్ర‌హాన్ని తెలంగాణ పోలీసులు చ‌విచూశారు. ఎస్ ఐ కాల‌ర్ ప‌ట్టుకుని ఆమె ఆగ్ర‌హాన్ని చూసిన క్యాడ‌ర్‌ మ‌ళ్లీ మ‌హంకాళిగా రేణుకా మారారంటూ చెప్పుకోవ‌డం వినిపించింది. ఎన్నో ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు, ర్యాలీల్లో పాల్గొన్న ఆమె ఖ‌మ్మం నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఎదిగారు. జాతీయ స్థాయిలో అమెకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. పార్ల‌మెంట్ లోనూ బ‌య‌టా ఫైర్ బ్రాండ్ గా రేణుక‌ను చెప్పుకుంటున్నారు. ప్ర‌త్య‌ర్థులు ఆమెతో ఢీ కొట్ట‌లేక వెళ్లిపోతుంటారు. అలాంటి రేణుకా చౌద‌రిని అదుపులోకి తీసుకోవాల‌ని యువ పోలీసు ఎస్ ఐ చేసిన ప్ర‌య‌త్నం అత‌న్ని చొక్కా ప‌ట్టుకునే వర‌కు వెళ్లింది. ఆ దృశ్యాన్ని చూసిన కాంగ్రెస్ క్యాడ‌ర్ మాత్రం రేణుక ఫైర్ ను చూసి తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.