Yadagirigutta : యాదగిరి గుట్టకు మళ్లీ రిపేర్లు.. ఈసారైనా పరువు నిలిచేనా?

యాదగిరి గుట్టకు మళ్లీ మరమ్మతులు జరుగుతున్నాయి. మరి ఈసారైనా పరువు నిలబడేనా? గట్టి వాన కొట్టినా గుట్ట మీద చుక్క నీరు నిలవకుండా, మొన్నటిలా ఆగమాగం కాకుండా గట్టి చర్యలే తీసుకుంటున్నారు.

  • Written By:
  • Updated On - May 19, 2022 / 12:51 PM IST

యాదగిరి గుట్టకు మళ్లీ మరమ్మతులు జరుగుతున్నాయి. మరి ఈసారైనా పరువు నిలబడేనా? గట్టి వాన కొట్టినా గుట్ట మీద చుక్క నీరు నిలవకుండా, మొన్నటిలా ఆగమాగం కాకుండా గట్టి చర్యలే తీసుకుంటున్నారు. ఈసారిచేసే మరమ్మతులు శాశ్వతంగా ఉండిపోయేలా చర్యలు చేపడుతున్నారు. అష్టభుజి ప్రాకార మండపంలో ఈసారి లీకేజీలకు ఆస్కారం లేకుండా కొన్ని కెమికల్స్, సిమెంట్ కలిపి ఖాళీలను పూడ్చుతున్నారు. ప్రసాదాల తయారీ భవనం, విష్ణు పుష్కరిణి ప్రాంతంలో చెమ్మలాగ రావడాన్ని గమనించిన అధికారులు.. వాటిని కూడా సరిచేస్తున్నారు. అలాగే మొన్న వర్షాలకు ఘాట్‌రోడ్లపై వరద పారింది. ఈసారి అలా జరక్కుండా పక్కా డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఇక మాఢవీధుల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు దక్షిణ దిశలో ఫ్లోరింగ్‌ దెబ్బతిన్నది. ఈ ప్రాంతంలో మైనం, సిమెంట్ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల సీసం నింపుతున్నారు.

గుట్టపై పడే ప్రతి చినుకు ఎక్కడా ఆగకుండా డ్రైనేజీ ద్వారా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో ఘాట్‌కు అనుబంధంగా నిర్మించిన రోడ్డు గత వానకు కుంగిపోయింది. ప్రస్తుతం దీన్ని పకడ్బందీగా పునర్నిర్మిస్తున్నారు. అంతేకాదు, మొన్న గంట వర్షానికే క్యూలైన్లలోకి, ప్రధాన ఆలయంలోకి నీళ్లు వచ్చేశాయి. దీనికి కూడా ప్రత్యేక మరమ్మతులు చేస్తున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. కొండ కింద కూడా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు అధికారులు. బస్సులు ఆపే పార్కింగ్ ప్లేస్‌లో నీరు ఆగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంత వర్షం వచ్చినా సరే రింగురోడ్డు మునిగిపోకుండా పక్కా ప్రణాళికలు తయారు చేశారు. వర్షపు నీరు ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా మరో సైడ్‌ డ్రైనేజీ లైన్‌ నిర్మిస్తున్నారు. అవసరమైతే డివైడర్‌లో కొంత భాగం తొలగించి డ్రైనేజీ లైన్లను నిర్మించాలనుకుంటున్నారు. రింగురోడ్డు మీదకు వచ్చే వరద నీరు.. ఊరకుంట చెరువు నుంచి వస్తోంది. దీంతో ఈ నీటిని యాదగిరిపల్లి శివారులోని కల్వర్టులోకి పంపేలా డ్రైనేజీ లైన్‌ నిర్మిస్తున్నారు. మొత్తానికి రాబోయే వర్షాకాలంలో యాదగిరి గుట్ట మరోసారి వార్తల్లో నిలవకూడదన్న రీతిలో పనులు చేస్తున్నారు అధికారులు.