Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు నుంచి ఊరట లభించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టివేయడం ఆయనకు న్యాయ పరంగా పెద్ద ఊరటగా నిలిచింది. ఈ కేసు 2016లో పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఓ హౌసింగ్ సొసైటీకి చెందిన స్థలాన్ని బలవంతంగా ఆక్రమించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ పెద్దిరాజు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, మూడో వ్యక్తి లక్ష్మయ్యలపై ఎస్సీ, ఎస్టీ నిర్బంధ నిరోధక చట్టం కింద కేసు నమోదు అయ్యింది. కేసు నమోదైనప్పటి నుంచీ వివాదంగా మారింది. ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, తనను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Gangs Of Bihar: పాట్నాలో సంచలనం.. ఆస్పత్రిలోనే ఖైదీని చంపిన దుండగులు, వీడియో వైరల్!
ఈ కేసును కొట్టివేయాలంటూ 2020లో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయ ప్రక్రియ సాగిన తరువాత, గత నెల 20న ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తుది తీర్పును రిజర్వు చేసింది. చివరకు, జూలై 17న కేసుపై తుది తీర్పును వెలువరించింది. తీర్పు సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేవంత్ రెడ్డి సంఘటన జరిగిన సమయంలో సంఘటనా స్థలానికి రాలేదని దర్యాప్తులో తేలిందని పేర్కొంది. ఫిర్యాదుదారుడు చేసిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని, అవి న్యాయపరంగా నిలవవని న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టపరంగా తగిన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.
ఈ తీర్పుతో రేవంత్ రెడ్డికి న్యాయ విజయంతో పాటు రాజకీయంగా ఊపిరిపీల్చుకునే అవకాశమూ లభించింది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సమయంలో ఇలా కోర్టు నుంచి ఊరట రావడం ఆయనకు ప్రతిష్టాత్మకంగా భావించబడుతోంది. ఇదిలా ఉండగా, కేసు తొలగింపుపై అధికార టీఎస్‌పీసీ, రేవంత్ అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “న్యాయం విజయించిందని” అన్నారు. ఇకపోతే, ఈ కేసు కేవలం రాజకీయ వేధింపుల కోణంలోనే నమోదైందన్న అభిప్రాయాలను హైకోర్టు తీర్పు బలపరిచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.