BRS Manifesto : ‘‘ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయ్యే మేనిఫెస్టోను కేసీఆర్ రెడీ చేస్తున్నారు. ప్రజలకు ఏం కావాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్. మీరు కోరుకునే విధంగానే మేనిఫెస్టోలో ప్రకటనలు ఉంటాయి. శుభవార్తలు వినేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఇటీవల పేర్కొన్నారు. ఆయన చెప్పిన విధంగానే సంచలన హామీలతో బీఆర్ఎస్ మేనిఫెస్టో రెడీ అవుతోందట. ఆసరా పెన్షన్లను రూ.2,016 నుంచి రూ.3,016కు పెంచే హామీ ఇందులో అత్యంత కీలకమైంది. దీంతోపాటు వంటగ్యాస్ ధరను రూ.700కు తగ్గించే హామీని కూడా కేసీఆర్ ఇవ్వబోతున్నారట. ప్రస్తుతం రైతుబంధు పథకం కింద ఎకరానికి ప్రతి ఏడాది ఇస్తున్న రూ.10వేల మొత్తాన్ని రూ. 15 వేలకు పెంచే యోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే రైతుబంధ ఆర్థికసాయం మరో 50 శాతం పెంచుతారన్న మాట. ఎకరానికి 2 బస్తాలు చొప్పున యూరియాను రైతులకు ఉచితంగా అందించే పథకాన్ని ప్రకటించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు కూడా ప్రస్తుతం అందిస్తున్నదానికంటే కొంత అదనంగా కలిపి అందించాలనే యోచన ఉందని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join
‘ఆరోగ్య భరోసా’ రూ.10 లక్షలు..
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలనే ప్రతిపాదన సీఎం కేసీఆర్ పరిశీలనకు వెళ్లిందని తెెలిసింది. అయితే దానిపై ఆయన ఎలా స్పందించారనేది తెలియరాలేదు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను కలిపి అర్హులైన అందరికీ ‘ఆరోగ్య భరోసా’ పేరుతో రూ.10 లక్షలతో ‘హెల్త్‌కార్డు’ను అందించాలని సర్కారు భావిస్తోంది. మంత్రి కేటీఆర్ కూడా ఇటీవల హన్మకొండ సభ వేదికగా కీలకమైన లీకు ఇచ్చేశారు. పెన్షన్లను పెంచుకుందామని, దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తారంటూ చెప్పకనే చెప్పేశారు. పార్టీలో కీలక నేతలుగా, ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న హరీశ్ రావు, కేటీఆర్ లు చేస్తున్న ప్రకటనలు… అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. కేసీఆర్ ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.
Also read : World Cup Points Table: వన్డే ప్రపంచకప్‌లో టాప్- 4 జట్లు ఇవే.. ఆస్ట్రేలియాపై మ్యాచ్ గెలిచినా ఐదో స్థానంలో భారత్..!
15న బీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ భేటీ
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈనెల 15న తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలోనే బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను గులాబీ బాస్ విడుదల చేయనున్నారు. ఆ వెంటనే బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు. అదే రోజు సాయంత్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తొలి ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం 16, 17, 18 తేదీల్లో వివిధ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు (BRS Manifesto) చెబుతున్నాయి. నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.