Site icon HashtagU Telugu

Black Magic: చేతబడి కలకలం.. స్తంభానికి కట్టి, నిర్దాక్షిణ్యంగా కొట్టి!

Chetabadi

Chetabadi

శాస్త్ర సాంకేతికం రంగం పరుగులు పెడుతున్నా.. గ్రామాలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా నేటికి సామాజిక రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయి. మూఢనమ్మకాలు, చేతబడి అంటూ పచ్చని పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొడుతున్నారు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. పల్లెల్లోకి టెక్నాలజీ వాడం పెరిగినా.. సంఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా చేతబడి చేశారంటూ దంపతులపై సొంత బంధువులే దాడి చేయడం చర్చనీయాంశమవుతోంది.

చేతబడి నెపంతో సొంత బంధువులే ఒక వ్యక్తి, అతని భార్యను విద్యుత్ స్తంభానికి కట్టేసి నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఈ సంఘటన సోమవారం ఉదయం అల్లాదుర్గం గ్రామంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు బోయిన రమేష్ (40), అతని భార్య రజిత (38) ఇంటిపై దాడి చేసి, తమపై చేతబడి చేస్తున్నారని ఆరోపిస్తూ, వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం దంపతులపై దాడి చేసి వీధిలో ఊరేగించారు. అనంతరం వారిని విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. అయితే, స్థానికులు దాడిని ఆపడానికి, దంపతులను రక్షించడానికి ప్రయత్నించలేదు. ప్రేక్షకపాత్ర వహించారు. ఈ ఘటన అల్లాదుర్గంలో సంచలనం సృష్టించింది. దాడి గురించి పోలీసులకు సమాచారం అందించడంతో సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మోహన్ రెడ్డి గ్రామానికి చేరుకొని దంపతులను రక్షించారు. బాధితులను ఆస్పత్రికి తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.