Red Alert in Telangana : ⚠️ తెలంగాణ లో రెడ్ అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ శాఖ ఇవాళ రెడ్ వార్నింగ్ (Red Alert) జారీ చేసింది. ఈ సాయంత్రం తర్వాత నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

Red Alert in Telangana :

భారీ నుంచి అతి భారీ వర్షాలు

హైదరాబాద్ వాతావరణ శాఖ ఇవాళ రెడ్ వార్నింగ్ (Red Alert) జారీ చేసింది. ఈ సాయంత్రం తర్వాత నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అటు VKB, సంగారెడ్డి, MDK, జగిత్యాల, నిర్మల్, NZB, KMR, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది. భద్రాద్రి, ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, ఖమ్మం, సూర్యాపేట, మేడ్చల్, రంగారెడ్డి, MHBD జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా భారీగా బలపడింది. దీని ప్రభావంతో.. తెలంగాణ వ్యాప్తంగా గతరాత్రి నుంచి ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కరాత్రిలోనే కొన్నిప్రాంతాల్లో 20 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్లు దాటుతూ పలువురు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా.. మోరంచ వాగు ఉప్పొంగడంతో మోరంచపల్లె గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుంది. వారిని రక్షించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

మరోవైపు భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. ముఖ్యంగా నైట్ డ్యూటీలు చేసే ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా.. వర్షాలు ఇలాగే కొనసాగితే రేపుకూడా సెలవు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లకు రెడ్ (Red Alert) అలర్ట్ ప్రకటించారు. ఎల్బీ నగర్, సికింద్రాబాద్ ,చార్మినార్, ఖైరతాబాద్ , కూకట్ పల్లి , శేరిలింగంపల్లి జోన్లలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో.. జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. అనవసరంగా ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తీవ్రంగా హెచ్చరించింది.

ఎవరికైనా సహాయం కావాలంటే.. 040-21111111 , 9000113667 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని తెలిపింది.

వర్షాల కారణంగా ఎక్కడైనా వాహనాలు ఆగిపోతే.. 8333993360, 9490617346 నెంబర్ కు వాట్సప్ ద్వారా సమాచారం అందిస్తే సహాయం చేస్తామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా రహదారిపై వాహనం నిలిచిపోతే వాహనదారులు ఈ ప్రత్యేక నంబరును సంప్రదించవచ్చన్నారు. అలాగే మేడ్చల్ జిల్లా పరిధిలో వాహనదారులు 8712663011, 8712663010 నంబర్లను సంప్రదించవచ్చని మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ తెలిపారు.

Also Read:  Army Helicopters: జలదిగ్భంధంలో మోరంచపల్లి గ్రామం, రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లు!