తెలంగాణలో యాసంగి పంట సర్వేను పూర్తి చేసేలా కేంద్రం గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వ్యవసాయ శాఖ త్వరగా సర్వే పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా.. నిరుద్యోగులకు చక్కని అవకాశం ఇచ్చింది. 45 రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు గాను ప్రైవేట్ సర్వేయర్లు, వాలంటీర్ల నియామకాలను చేపడుతోంది. ఈ మేరకు గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతను గుర్తించి జిల్లా అధికారులకు వారి వివరాలు అందిస్తున్నారు. ప్రస్తుతమున్న ఏఈవోలతో పంట సర్వే పూర్తి కావాలంటే దాదాపు 3 నెలలకు పైగానే సమయం పట్టే అవకాశం ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా మెుత్తం 10,621 గ్రామాల్లో 194. 69 లక్షల సర్వే నెంబర్ల ఉండగా.. ఇందులో 9795 గ్రామాలకు ప్రస్తుతం విలేజ్మ్యాప్ ఉంది. వీటిలోనూ 174.36 లక్షల సర్వే నెంబర్లకు సంబంధించిన పంట భూముల సర్వేను ప్రైవేటు సర్వేయర్లు, వాలంటీర్లకు అప్పగిస్తారు. మిగిలిన 826 గ్రామాల్లోని పోడు భూముల పంట సర్వేను ఏఈవోలకు అప్పగిస్తారు. కొత్తగా రిక్రూట్ చేసుకొనే వాలంటీర్లు, ప్రైవేటు సర్వేయర్లు అదే గ్రామానికి చెందిన వారై ఉండనున్నారు. రోజుకు 150 నుంచి 200 సర్వే నెంబర్ల కలిగిన పంట ఫొటోలు తీసేందుకు టార్గెట్ నిర్దేశించనున్నారు. ఈ సర్వేతో వాలంటీర్లకు రోజుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు సంపాదించుకోవచ్చు.
పది రోజులు పనిచేస్తే గ్రామంలో ఉన్న పంటల వివరాలు పూర్తిగా ప్రభుత్వానికి సర్పించవచ్చు. పంట సర్వే కోసం కేంద్రం రూ.30.42 కోట్లు కేటాయించగా.. వానాకాలం సీజన్‌లో పంట సర్వే పూర్తి చేస్తే రూ.2.93 కోట్లు ఖర్చయింది. మిగిలిన డబ్బుతో ప్రైవేటు సర్వేయర్లు, వాలంటీర్లకు ఫొటోకు రూ.7 చొప్పన ఇవ్వనున్నారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ చావ్లా రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. తాము సూచించిన గడువులో డిజిటల్ సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఉన్నతాధికారుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు ఏఈవోలతో సాధ్యసాధ్యాలపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
ఏఈవోలు తమతో పాటు ప్రైవేటు సర్వేయర్లు, స్థానికంగా ఉండే వాలంటీర్ల సహాయం తీసుకుంటే 100 శాతం ఖచ్చితమైన సర్వే రిపోర్టు ఇవ్వనున్నారు. దీని ద్వారా పంట సాగు చేసిన ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలు అందేలా చేయవచ్చని సూచనలు చేశారు. కాగా, పనిచేసే సామర్థ్యం కలిగిన యువతను ఎంపిక చేసుకోవాలని ఏఈవోలకు అధికారులు సూచించారు. ఒక గ్రామానికి ఒక వాలంటీర్ మాత్రమే ఉండాలి. బీఎస్సీ అగ్రికల్చర్ డిప్లమా లేదా ఏదైనా సైన్సు కోర్సు, ఇంటర్, టెన్త్‌లలో ఏదో ఒకటి ఉత్తీర్ణులుగా ఉండి ఉండాలి. వాలంటీర్లకు మొబైల్ యాప్ వినియోగించే విధానం కూడా తెలియాలి. సెలవులు లేకుండా సర్వే పూర్తయ్యే వరకు పనిచేయాల్సి ఉంటుంది.
