తెలంగాణలో దసరానే అతిపెద్ద పండగ. ఈ పండగనాడు రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. బంధుమిత్రులను కలిసి సంతోషాలు పంచుకుంటూ…షమీ పూజలు నిర్వహించి జమ్మిని బంగారంగా భావించి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇదేకాదు దసరా అంటేనే భారీగా విందులు. అయితే తెలంగాణలో జరిగే ఈ విందుల్లో మద్యానికి మాంసానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెగ్గు లేని దావత్ ఉండదు. బంధుమిత్రులతో కలిసి పెగ్గేస్తారు. ఇలాంటి సాంప్రదాయం తరాలుగా వస్తూనే ఉంది.
ఈ ఏడాది దసరా సందర్భంగా పాలమూరు జిల్లాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. గతేడాదిలో పోల్చితే దాదాపు ఏడు కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. మద్యం విక్రయాల్లో ఉమ్మడి జిల్లాలో నాగర్ కర్నూల్ మొదటిస్థానంలో నిలవగా..మహబూబ్ నగర్ రెండో స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో జడ్చర్ల, గద్వాల, కొత్తకోట ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో జరిగిన మద్యం విక్రయాలు సర్కార్ ఖజానాకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి.
దసరా సందర్బంగా మూడు రోజులుగా మద్యం దుకాణాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. గతేడాది దసరాకు 164 మద్యం దుకాణాల్లో 30కోట్ల మద్యం అమ్ముడపోయింది. ఈసారి ఏకంగా 37.14కోట్ల వ్యాపారం జరిగింది. డిపోల పరిధిలో ప్రతి నెలా రూ.200 కోట్ల వరకు వ్యాపారం జరుగుతోంది. ఈసారి తిమ్మాజీపేట మద్యం డిపో పరిధిలో 19,302 కార్టన్ల వైన్, 49,931 కార్టన్ల బీర్లు అముడుపోయింది. రూ.23.21కోట్ల వ్యాపారం జరిగింది. కొత్తకోట మద్యం డిపో పరిధిలో 12,597 కార్టన్ల వైన్, 23,241 బీర్లు అడుపోయింది. రూ.13.93 కోట్ల వ్యాపారం జరిగింది.