BRS MLA Lasya Nanditha : ఎమ్మెల్యే లాస్య మృతికి ప్రధాన కారణాలు ఇవేనా…?

  • Written By:
  • Updated On - February 23, 2024 / 11:04 AM IST

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha)..శుక్రవారం ఉదయం పటాన్‌చెరూ సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Acccident)లో మృతి చెందారు. ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు (CAR) అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై ఆమె సాధించి అసెంబ్లీ లో అడుగుపెట్టారు. ఇంతలోనే ఆమె మృతి చెందడం బిఆర్ఎస్ శ్రేణులనే కాదు యావత్ రాజకీయ ప్రముఖులను విషాదంలో పడేసింది.

కాగా లాస్య మృతికి ప్రధానంగా మూడు కారణాలు అని పోలీసులు అనుమానిస్తున్నారు. లాస్య ప్రయాణిస్తున్న కారు.. శుక్రవారం ఉదయం మేడ్చల్ నుంచి పటాన్‌చెరువు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె మృతికి ప్రధాన కారణం అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్.. తమ కారు ముందు వెళ్తోన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో సడన్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు.. అదుపు తప్పి ఔటర్ రింగ్ రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో.. ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోకపోవడం కూడా ఆమె ఇంటర్నల్‌ పార్ట్స్‌ డ్యామేజ్‌ అయ్యి.. ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పోలీసులు చెపుతున్నారు. సీటు బెల్ట్‌ పెట్టుకుని ఉంటే.. గాయాలతో బయటపడేవారని.. ప్రాణం పోయేది కాదని అంటున్నారు.

ఇక మూడో కారణం..ఈమె ప్రయాణిస్తున్న మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌6 కారుకి సేఫ్టీ రేటింగ్‌ తక్కువగా ఉంది. అది తెలిసి కూడా వారు అతివేగంతో ప్రయాణించడం ప్రమాదానికి మరో కారణం అంటున్నారు. ఇక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్‌ను మదీనాగూడ శ్రీకర హాస్పిటల్‌ హాస్పటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఇక లాస్య మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) స్పందిస్తూ… రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా నందిత ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) స్పందిస్తూ.. నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. లాస్య ఇక లేరనే అత్యంత విషాదకరమైన, షాకింగ్‌ న్యూస్‌ తెలుసుకున్నానని చెప్పారు. దాదాపు వారం క్రితమే ఆమెను పరామర్శించానని, అంతలోనే మళ్లీ ప్రమాదానికి గురై మృతి చెందడం బాధాకరమన్నారు. చాలా మంచి నాయకురాలిగా ఉన్న యువ శాసనభ్యురాలిని కోల్పోవడం బీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని నష్టమని చెప్పారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబం, స్నేహితులకు బలం చేకూర్చాలని ప్రార్థించారు.

ఇక సీఎం రేవంత్ (CM Revanth Reddy) సైతం లాస్య మృతి దిగ్భ్రాంతి గురి చేసిందన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనుకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమని సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఇక లాస్య నందిత ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. నల్లగొండలో బీఆర్‌ఎస్‌ బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్న గాయంతో బయటపడిన లాస్య.. ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఏకంగా ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరం.

లాస్య నందిత.. 1987లో హైదరాబాద్‌లో జన్మించారు. కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఈమె.. అనంతరం 2015లో రాజకీయాల్లోకి ఏంటీ ఇచ్చారు. మొదటగా కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2016లో తన తండ్రి, అప్పటి ఎమ్మెల్యే సాయన్నతోపాటు బీఆర్‌ఎస్‌లో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. తండ్రి మరణంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి పోటీచేసి విజయం సాధించారు.

Read Also : Former CM Manohar Joshi: మహారాష్ట్ర మాజీ సీఎం కన్నుమూత