Site icon HashtagU Telugu

Prakash Raj TRS Politics : మ‌రో జ‌య‌శంక‌ర్‌.!

Kcr Prakash Raj

Kcr Prakash Raj

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ను టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఫోక‌స్ చేస్తోంది. జాతీయ రాజ‌కీయాలు ఆయ‌న లేకుండా కేసీఆర్ చేయ‌లేడా? నిజంగా ప్ర‌కాష్ రాజ్ కు రాజ్య‌స‌భ ప‌ద‌వి ద‌క్క‌నుందా? కేసీఆర్ ఎందుకు ప్ర‌కాష్ రాజ్ కు ఎవ్వ‌రికీ ఇవ్వ‌నంత ప్రాధాన్యంత ఇస్తున్నాడు? ఇవే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తోన్న మాట‌లు.సాధార‌ణంగా ఎలాంటి వ్యూహం లేకుండా కేసీఆర్ ఎవ‌ర్నీ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కూడా ఆనాడు తెలంగాణ ఉద్య‌మ సిద్ధాంత క‌ర్త ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ , ప్రొఫెస‌ర్ కోదండ‌రాం రెడ్డిని చెరో వైపు పెట్టుకున్నాడు. ఎప్పుడూ వాళ్ల‌తోనే ఉండేవాడు. యూనివ‌ర్సిటీల్లో విద్యార్థుల ఉద్య‌మం ఎగిసిప‌డేలా కేసీఆర్ తిరుగులేని వ్యూహాన్ని ర‌చించాడు. ఆ త‌రువాత తెలంగాణ జేఏసీ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా కోదండ‌రాంరెడ్డిని ముందుంచాడు. రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ర్షించాడు. ఆనాడు విజ‌య‌శాంతిని పార్టీలోకి తీసుకున్నాడు. ఓసేయ్ రాముల‌మ్మ ద్వారా దొర‌త‌నంపై పోరాడిన క్రేజ్ ను ఉప‌యోగించుకున్నాడు. ఆమెను ఎంపీగా చేశాడు. ఇలా వివిధ రంగాల‌కు చెందిన మేధావులు, ప్ర‌ముఖుల‌ను ప‌క్క‌న పెట్టుకుని ఉద్య‌మాన్ని న‌డిపాడు. దానికి స‌మాంత‌రంగా రాజ‌కీయ వ్యూహాల‌ను న‌డ‌ప‌డం ద్వారా కేసీఆర్ ఉద్య‌మ‌నాయ‌కునిగా ఫోక‌స్ అయ్యాడు.

జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌ని భావిస్తోన్న కేసీఆర్ ఆనాడు తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఏ విధంగా వివిధ రంగాల‌కు చెందిన వాళ్ల‌ను ఉప‌యోగించుకున్నాడో..ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మేధావివ‌ర్గాన్ని చేర‌దీస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు ప్ర‌కాష్ రాజ్‌, కేసీఆర్ భేటీ తొలుత ప్ర‌గ‌తిభ‌వ‌న్లో జ‌రిగింది. ఆ రోజున ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ నినాదాన్ని వినిపించాడు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌కాష్ రాజ్ టీఆర్ఎస్ కు మ‌ద్ధ‌తుగా వాయిస్ వినిపించాడు. కాళేశ్వ‌రం, మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ‌, నిరంత‌ర విద్యుత్ త‌దిత‌ర అంశాల‌ను ఫోక‌స్ చేశాడు. తెలంగాణ‌కు కేసీఆర్ మిన‌హా ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని ప్ర‌కాష్ రాజ్ ప్ర‌చారం చేశాడు. ఆ ఎన్నిక‌ల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వ‌చ్చాడు.2018 అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ నినాదం క్లోజ్ అయింది. మ‌ళ్లీ ఇప్పుడు పీపుల్స్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ ముందుకొచ్చాడు. ఆ క్ర‌మంలో మ‌హారాష్ట్ర సీఎం థాక‌రే, ఎన్సీపీ నేత శ‌ర‌ద్. ప‌వార్ ను క‌ల‌వ‌డానికి వెళ్లిన‌ప్పుడు ప్ర‌కాష్ రాజ్ అక్క‌డ క‌నిపించ‌డం టీఆర్ఎస్ శ్రేణుల‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఆరోజు ముంబాయ్ లో షూటింగ్ లో ఉన్న ప్ర‌కాష్ రాజ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశాడ‌ని పార్టీ వ‌ర్గాల వినికిడి. అందుకే, ముంబైలో ప్ర‌కాష్ రాజ్ క‌నిపించాడ‌ని అనుకున్నారు. కానీ, ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ త‌న‌తో ప్ర‌కాష్ రాజ్ ను వెంట‌బెట్టుకుని వెళ్లాడు. అంతేకాదు, గ‌జ్వేల్ కు వెళ్లిన ప్ర‌శాంత్ కిషోర్ తో కూడా ప్ర‌కాష్ రాజ్ ఉన్నాడు. దీంతో ప్ర‌కాష్ రాజ్ వ్య‌వ‌హారం గులాబీ శ్రేణుల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

వాస్త‌వంగా ప్ర‌కాష్ రాజ్ స్వ‌స్థ‌లం బెంగుళూరు. స్టేజ్ ఆర్టిస్ట్ గా తొలి రోజుల్లో గుర్తింపు పొందాడు. ఆ త‌రువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాకుండా త‌మిళ‌నాడు, కర్నాట‌క‌, ఏపీ, కేర‌ళ‌, హిందీ రాష్ట్రాల్లో కూడా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. బ‌హుభాషా గోవిదునిగా ఐదారుభాష‌ల‌ను మాట్లాడ‌గ‌ల‌డు. పైగా ప‌లు రాష్ట్రాల్లో గుర్తింపు క‌లిగిన న‌టుడు. 2019 ఎన్నిక‌ల్లో సెంట్ర‌ల్ బెంగుళూరు నుంచి స్వ‌తంత్ర్య ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అదే స‌మ‌యంలో వివాద‌స్ప‌ద వ్య‌క్తిగా కూడా టాలీవుడ్ భావిస్తోంది. ఒకానొక స‌మ‌యంలో నిర్మాత‌లు ఆయ‌న్ను దూరంగా పెట్టారు. ఇటీవ‌ల మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లోనూ పోటీ చేసి ఓడిపోయాడు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న గెలుపు కోసం కేటీఆర్ ప‌లువురు సినీ ఆర్టిస్ట్ ల‌కు ఫోన్ చేసి ప్ర‌మోట్ చేశాడు. స్థానికేతురుడిగా ఉన్న ప్ర‌కాష్ రాజ్ ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయాడు.టాలీవుడ్, బాలీవుడ్ , టోలీవుడ్‌, శాండిల్ వుడ్ సెల‌బ్రిటీగా ప్ర‌కాష్ రాజ్ కు గుర్తింపు ఉంది. ఆయ‌నకున్న గుర్తింపుతో పాటు ఇటీవ‌ల మోడీపై ఆయ‌న చేస్తోన్న పోరాటం కేసీఆర్ కు న‌చ్చింద‌ట‌. రెండేళ్ల క్రితం జ‌ర్న‌లిస్ట్ గౌరీలంకేష్‌ హ‌త్య సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస్క్ మోడీ అనే యాష్ టాగ్ తో ఉద్య‌మం చేశాడు. ఇవ‌న్నీ ఆయ‌న‌లోని రాజ‌కీయ ప‌రిణితి, మేధావి వ‌ర్గానికి సంబంధించిన ఆన‌వాళ్లు. అందుకే, కేసీఆర్ ఆనాడు ఉద్య‌మ స‌మ‌యంలో ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ కు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు ప్ర‌కాష్ రాజ్ కు ఇస్తున్నాడ‌ట‌. ఆయ‌న్ను జాతీయ స్థాయి ఎంట్రీ కోసం కేసీఆర్ ఉప‌యోగించుకుంటున్నాడ‌ని గులాబీ శ్రేణుల్లోని గుస‌గుస‌లు.

ఉప ప్రాంతీయ పార్టీగా ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు ఉంది. దానికి జాతీయ స్థాయి లుక్ ఇవ్వాలంటే ప్రాంతీయ త‌త్త్వాన్ని వీడాలి. టీఆర్ఎస్ ఉద్య‌మ పార్టీ కాద‌ని ఫ‌క్త్ రాజ‌కీయ పార్టీగా గుర్తించాల‌ని 2014లోనే కేసీఆర్ పిలుపునిచ్చాడు. ఇప్పుడు జాతీయ పార్టీ లుక్ కోసం ప్ర‌కాష్ రాజ్ లాంటి వాళ్ల‌ను ఫోక‌స్ చేయాలి. టాలీవుడ్ లో కొన‌సాగుతోన్న ఆధిప‌త్యాన్ని త‌గ్గించాలంటే, కేసీఆర్ కు ఒక అస్త్రం ప్ర‌కాష్ రాజ్‌. ఇటీవ‌ల జ‌రిగిన మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో కూడా స్థానిక‌త‌పై పెద్ద చ‌ర్చ జ‌రిగింది. ప్రాంతీయ భావాలు పోవాల‌ని ప్ర‌కాష్ రాజ్ ప్ర‌చారం చేశాడు. ఇవ‌న్నీ కేసీఆర్ కు జాతీయ లుక్ తీసుకురావ‌డానికి ప్ర‌యోగించిన అంశాలుగా కొంద‌రు భావిస్తున్నారు. అదే నిజం అయితే, ప్ర‌కాష్ రాజ్ కు రాజ్య‌సభ ఇవ్వ‌డం కంటే ఉద్య‌మ స‌మ‌యంలో జ‌య‌శంక‌ర్ ను వాడుకున్న‌ట్టు ప్ర‌కాష్ రాజ్ ను జాతీయ రాజ‌కీయ ఎంట్రీ కోసం ఉప‌యోగించుకుని వ‌దిలేయ‌డం మామూలే అనేది కేసీఆర్ రాజ‌కీయ బాధితుల భావ‌న‌. సో..ప్ర‌కాష్ రాజ్ విష‌యంలో కేసీఆర్ ఎలాంటి ప‌ద్మ‌వ్యూహం ప‌న్నాడో..భ‌విష్య‌త్ చెప్ప‌నుంది.