తెలంగాణలో గత కొద్దీ రోజులుగా రైతులు తీవ్రమైన యూరియా కొరతను ఎదుర్కొంటున్నారు. పంటలకు అత్యవసరమైన యూరియా లభించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీనితో సింగిల్ విండోలు, ఆగ్రోస్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల పోలీసులు లాఠీలు ఝుళిపించడం, బ్లాక్‌లో యూరియా అమ్ముడవడం వంటి సంఘటనలు రైతులను మరింత కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడం వల్ల యూరియాకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. 2014లో కేవలం 23 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండగా, ఇప్పుడు అది 67 లక్షల ఎకరాలకు విస్తరించింది. ఇది యూరియా కొరతకు ఒక ప్రధాన కారణం.
Spirituality : పూజా గృహ నియమాలు ఏమిటి?..అగరబత్తి, పువ్వులకి వాస్తు నియమాలు ఏమిటి?
ఈ యూరియా కొరతపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా కేంద్రానికి లేఖ రాస్తూ, రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. అయితే, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మరియు బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ నేతలు పదేళ్ల తమ పాలనలో ఇలాంటి పరిస్థితి రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తుండగా, బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అంచనా వేయకపోవడమే కారణమని అంటున్నారు.
నిజానికి.. యూరియా కొరతకు అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్రం తెలంగాణకు కేటాయించిన 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో, విదేశాల నుండి రావాల్సిన 3.96 లక్షల టన్నులలో కేవలం 2.05 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయింది. చైనా, జర్మనీ వంటి దేశాల నుండి సరఫరాలో అంతర్జాతీయ సమస్యల కారణంగా ఈ జాప్యం జరిగింది. అలాగే, రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌లో సాంకేతిక లోపాల వల్ల దాదాపు 78 రోజుల పాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. దీనివల్ల దేశీయ సరఫరా కూడా బాగా తగ్గిపోయింది.
ఈ సమస్యలన్నీ ఒకేసారి తలెత్తడం వల్ల యూరియా కొరత తీవ్రమైంది. కొందరు రైతులు అవసరానికి మించి యూరియాను నిల్వ చేసుకోవడం, అలాగే వ్యవసాయ అవసరాల కోసం వచ్చిన యూరియా అక్రమంగా పారిశ్రామిక అవసరాలకు తరలిపోవడం కూడా ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ విమర్శలు పక్కనపెట్టి, రైతుల సమస్యలను పరిష్కరించడానికి కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.