Ramoji Rao : అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ సంతాపం

ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

  • Written By:
  • Updated On - June 8, 2024 / 10:48 AM IST

Ramoji Rao : ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి..  రామోజీరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అక్కడి నుండే  తెలంగాణ ప్రభుత్వ  ప్రధాన  కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, రాచకొండ కమిషనర్‌కు సీఎస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక రామోజీ కుటుంబ సభ్యులతో ఫోనులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాగా, మన దేశంలో ఓ మీడియా దిగ్గజానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనుండటం ఇదే తొలిసారి.

 

సీఎం రేవంత్ ట్వీట్

రామోజీరావు మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి  శనివారం ఉదయం ట్వీట్ చేశారు. రామోజీ మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటు అని ఆయన చెప్పారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని రేవంత్ తెలిపారు. తెలుగువారి కీర్తిని  దేశం నలుమూలల వ్యాపింపచేయడంలో రామోజీరావు కీలక పాత్ర పోషించారన్నారు.  రామోజీ రావు ఏ రంగంలోకి అడుగిడినా విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేశారని రేవంత్ చెప్పారు. పత్రికా నిర్వహణ ఒక సవాల్ అనుకునే పరిస్థితుల్లో ఐదు దశాబ్దాల పాటు ఈనాడు పత్రికను నెంబర్ వన్ స్థానంలో నడపడం, ఈటీవీ స్థాపనతో టీవీ మీడియా రంగానికి దశాదిశా చూపిన దార్శనికుడు రామోజీరావు అని సీఎం రేవంత్ కొనియాడారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతో భేటీ అయిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రామోజీరావు మరణం తెలుగు మీడియా రంగానికీ, వ్యాపార రంగానికీ తీరని లోటు అని పేర్కొన్నారు.  రామోజీరావు(Ramoji Rao) ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సీఎం రేవంత్ తెలియజేశారు.

We’re now on WhatsApp. Click to Join

రామోజీరావు మరణంపై సంతాపం తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. “రామోజీ రావు మరణం చాలా బాధాకరం. ఆయన భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. ఆయన జర్నలిజం, చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. మీడియా, వినోద ప్రపంచంలో రామోజీరావు కొత్త ప్రమాణాలను నెలకొల్పారు. గతంలో చాలా సందర్భాల్లో రామోజీరావును కలిసి మాట్లాడే అవకాశం లభించడం నాకు దక్కిన గొప్ప అదృష్టం. ఆయా సమావేశాల సందర్భంగా రామోజీరావు నుంచి నాకు జ్ఞానం, ప్రయోజనం లభించాయి. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకూ, స్నేహితులకూ అసంఖ్యాక అభిమానులకూ నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read : Bird Flu Positive : భారత్‌లో పర్యటించిన బాలికకు బర్డ్ ఫ్లూ.. ఆస్ట్రేలియాలో కలకలం

పొంగులేటి, హరీశ్‌రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం

  • రామోజీరావు మృతిపట్ల తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
  • రామోజీరావు మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని బీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు చిరస్మరణీయులు అని కొనియాడారు.  పత్రిక, టీవీ, సినిమా తదితర రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు యావత్ తెలుగు జాతికి గర్వకారణమన్నారు. రామోజీరావు కుటుంబానికి, రామోజీ సంస్థల ఉద్యోగులకు హరీశ్‌రావు ప్రగాఢ సంతాపం తెలిపారు.
  • రామోజీ రావు మరణం పట్ల తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సామాన్య స్థాయి నుంచి లక్షల మందికి ఉపాధిని కల్పించే స్థాయికి ఎదిగిన రామోజీరావు జీవితం చాలా ఆదర్శనియమని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలనీ, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు ఆయన చెప్పారు.