Ramoji Rao : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలను ఇవాళ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య రామోజీ ఫిల్మ్‌సిటీలో జరపనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు రామోజీరావు అంతిమ యాత్ర మొదలవుతుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది. రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రాంగణంలోనే అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. మరోవైపు ఆదివారం, సోమవారం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join
రామోజీరావు పార్థివ దేహాన్ని ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఫిల్మ్ సిటీకి తరలివచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈనాడు సంస్థల ఉద్యోగులు, సిబ్బంది సైతం రామోజీరావు(Ramoji Rao) పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సహా ఇతర ప్రముఖులు రామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read : Relationship Tips : పెళ్లయిన ఆడవాళ్ళు ఈ విషయాలు తల్లిదండ్రులకు చెప్పకూడదు
అక్షర యోధుడు రామోజీరావు (88) ఈ నెల 5న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ ‘స్టార్’ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ‘ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కోసం రామోజీరావు ఈ నెల 5న చేరారు. ఆ సమయంలో గుండె వైఫల్యంతోపాటు తక్కువ రక్తపోటు ఉంది. వెంటనే అత్యవసర విభాగానికి తరలించి వెంటిలేటర్, ఇంట్రా అయోటిక్ బెలూన్ పంప్‌తో లైఫ్ సపోర్టు అందించడంతో పాటు అత్యవసరంగా యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశాం. నిపుణులైన కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ బృందం ఆధ్వర్యంలో చికిత్స అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించి శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు’ అని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.