Ramoji Rao: రామోజీరావు దార్శనికుడు.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త.

  • Written By:
  • Publish Date - November 16, 2023 / 10:15 AM IST

Ramoji Rao: చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది. రామోజీరావు నేడు 87వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.

కుటుంబ నేపథ్యం

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ.

బాల్యం- విద్యాభ్యాసం

ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికీ భక్తి, శుచి అలవడింది. లేకలేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీని చాలా ముద్దుచేసేవారు. పెద్దక్క పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటిపనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటూ ఉండేది. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా “రామోజీ రావు” అన్న పేరును సృష్టించుకుని తానే పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతమూ కొనసాగుతోంది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో ఆరవ ఫారం అక్కడే పూర్తిచేసుకుని, గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివాడు.

1961 ఆగస్టు 19న రామోజీరావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలసి పనిచేశారు.

Also Read: CPM : సీపీఎం ప్ర‌జా ర‌క్ష‌ణ భేరి స‌భ‌.. 31 డిమాండ్ల‌తో ప్రజా మేనిఫెస్టో రిలీజ్‌

రామోజీరావు తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసే తహశిల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని ఆశించాడు. అందుకోసం చదువు పూర్తయ్యాకా ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరాడు. మూడు సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగివచ్చాడు.

రామోజీరావు 1962 అక్టోబరులో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించాడు. ఇది అతని జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. 1967 – 1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించాడు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించాడు. 1970లో ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. దీని బాధ్యతలు అతని భార్య రమాదేవి చూసుకోసాగింది.

విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభించాలని రామోజీరావు 1970లో నిర్ణయించుకుని నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించాడు. రామోజీ గ్రూపు క్రింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి షోరూములు ముఖ్యమైనవి ఉన్నాయి. రామోజీరావు సినీ రంగంలో కూడా అనేక సినిమాలు నిర్మించారు. 2016లో సాహిత్యం, జర్నలిజం మీడియాకు చేసిన కృషికి ప్రణబ్ ముఖర్జీచే ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. 2000లో రామోజీరావు ‘నువ్వే కావాలి’ చిత్రానికి తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. అతను ‘కాంచన గంగ’, ‘మయూరి’, ‘అశ్విని’ వంటి చిత్రాలతో పాటు పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా గెలుచుకున్నాడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో రామోజీ రావు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఒక్కొక్కరికి రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు.