Ramoji Rao : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మరణంపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. వ్యాపారవేత్తగా, జర్నలిస్టుగా రామోజీరావు దేశానికి అందించిన సేవలను అందరూ కొనియాడుతున్నారు. ఈతరుణంలో ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ కృష్ణ రాజు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కీలక వివరాలను వెల్లడించారు. రామోజీరావు మరణానికి ముందే.. సమాధిని నిర్మించాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారని వెల్లడించారు. సమాధి నిర్మాణం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఓ ప్రదేశాన్ని చాలా ఏళ్ల క్రితమే రామోజీరావు ఎంపిక చేసుకున్నారని ఆయన తెలిపారు. తన సమాధి ప్రాంతాన్ని ఓ ఉద్యానవనంలా మార్చాలని రామోజీరావు(Ramoji Rao) అప్పట్లోనే నిర్దేశించారని రఘురామ కృష్ణ రాజు చెప్పారు.
రామోజీ గ్రూపు సంస్థల అధినేత, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడు పద్మ విభూషణ్ శ్రీ చెరుకూరి రామోజీరావు గారికి నా నివాళులు.. pic.twitter.com/NG4d4WwDsS
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 8, 2024
We’re now on WhatsApp. Click to Join
రామోజీ రావుకు మొక్కలంటే చాలా ఇష్టమని.. ఎన్ని కోట్లు నష్టపోయినా రామోజీ ఫిల్మ్ సిటీలాంటిదాన్ని సృష్టించటం మాటలు కావని రఘురామ కృష్ణ రాజు తెలిపారు. రామోజీరావు మృతిపట్ల రఘురామకృష్ణరాజు సంతాపం తెలిపారు. రామోజీతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఉదయం లేవగానే రామోజీరావు చనిపోయారనే వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. కొన్ని నెలల క్రితమే రామోజీ రావుతో రెండు గంటల పాటు మాట్లాడానని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. కాగా, రామోజీరావు అంత్యక్రియలను ఆదివారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఫిల్మ్‌సిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు.