Site icon HashtagU Telugu

Ramoji: రామోజీ ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ – సీఎం రేవంత్

Revanth Ramoji

Revanth Ramoji

రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రామోజీ ఫిల్మ్ సిటీ తెలుగు రాష్ట్రాల గర్వకారణమని, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి అది ఒక గొప్ప ఆస్తిగా నిలిచిందని అన్నారు. హైదరాబాద్‌లోని నాలుగు అద్భుతాలలో చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ తర్వాత నాలుగో వండర్‌గా రామోజీ ఫిల్మ్ సిటీని నిలిపిన రామోజీ రావుకు ఇది అర్జితమైన స్థానమని పేర్కొన్నారు. రామోజీ రావు నిర్మించిన సామ్రాజ్యం కేవలం వినోద రంగానికే పరిమితం కాకుండా, మీడియా, జర్నలిజం, సాంస్కృతిక విలువలు, వ్యాపార నైతికతలకు ప్రతీకగా నిలిచిందని సీఎం అభినందించారు. ఇంత విస్తృతమైన సంస్థలను నిర్వహించడం ఎంత క్లిష్టమో, రామోజీ రావు చూపిన దూరదృష్టి, క్రమశిక్షణ, విలువలు ఈ దేశంలో అరుదైనవని ఆయన అన్నారు.

‎Drinking Water: రోజులో ఒక లీటర్ కంటే తక్కువ నీరు తాగుతున్నారా.. అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే!

ఫిల్మ్ సిటీ ప్రారంభించిన రోజుల్లోనే “స్క్రిప్ట్‌తో వచ్చి, ప్రింట్ తీసుకుని వెళ్లండి” అని రామోజీ రావు చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ, ప్రస్తుతం ఆ కలను నిజం చేసే విధంగా ఆయన నిర్మించిన మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయికి చేరాయని రేవంత్ రెడ్డి అన్నారు. రామోజీ పేపర్ చదవడం, ఈటీవీ వార్తలు చూడడం ప్రజల నిత్య జీవితంలో భాగమైపోయిందని, వాస్తవమైన సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే తపన రామోజీ గ్రూప్ కార్యకలాపాల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన ప్రశంసించారు. పచ్చళ్లు అమ్మినా, పత్రికను ప్రజల చేతుల్లోకి తీసుకువెళ్లినా, అది రామోజీ రావు మేనేజ్‌మెంట్ స్టైల్ వల్లే సాధ్యమైందని వ్యాఖ్యానించారు. ప్రతి రంగంలోనూ రామోజీ రావు తన ముద్ర వేసిన వ్యక్తిత్వం కలిగిన అభ్యుదయ వేత్త అని సీఎం పేర్కొన్నారు.

రామోజీ ఆలోచనలు, ఆయన చూపిన మార్గం భవిష్యత్ తరాలకు చేరేలా అందరం కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రామోజీ రావు ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అని, ఆ బ్రాండ్‌ను అలాగే కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సరదాగా సంభాషణలు సాగించిన దృశ్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రెండు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికపై నవ్వులు పంచుకోవడం, రామోజీ గుర్తింపు కోసం ఒకే వేదికపై నిలవడం సోషల్ మీడియాలో కూడా విశేష స్పందన రాబట్టింది.

Exit mobile version