Site icon HashtagU Telugu

Atluri Rammohan Rao: రామోజీ సామ్రాజ్య శిల్పి ‘అట్లూరి’

Cropped

Cropped

అట్లూరి రామ్మోహన్ రావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన క్రమశిక్షణ, నడవడిక నిశ్శబ్ద విప్లవం. రామోజీ సామ్రాజ్యం వెనుక ఆర్థిక శిల్పి ఆయన. నమ్మిన బంటుగా నిరాడంబర శక్తిగా రామోజీ కి నిలిచారు. ఆయన మృతి ఈనాడు రామోజీరావుకు పెద్ద దెబ్బ. ఒకరకంగా తన వెన్ను విరిగినట్టే. ఆయన పేరు ‘‘పెద్ద ఎండీ’’ . దైనందిన వ్యవహారంలో ఆయన హోదా అదే. రామోజీరావు ఛైర్మన్ అయితే, ఆయన ఎండీ. రామోజీ ఆర్థిక సామ్రాజ్యంలో ఆయన కీలక పాత్ర కీలకం. అట్లూరి రామ్మోహనరావు(87). నిజానికి బయట ప్రపంచానికి ఆయన ఎవరో తెలియదు. ఆయన తెర వెనుక రామోజీరావు. ఆయన ఫోటోలు మీకు బయట పెద్దగా దొరకవు. గతంలో ఆయన సైన్స్ మాస్టారు అంటారు.

రామోజీరావు ఎదుగుదల వెనుక ఓ బలమైన ఇరుసు ఆయన. రామోజీరావులాగే వృద్దాప్యం మీద పడింది.కానీ ఆ బుర్ర చివరి వరకూ రామోజీరావు కోసం పనిచేస్తూనే ఉంది. అనారోగ్య కారణాలు ఏమిటో సరిగ్గా తెలియవు కానీ ఎఐజీ హాస్పిటల్‌లో అత్యవసర చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు.రామోజీరావుకు కష్టంలో, సుఖంలో, వైభవంలో, ఆనందం ఇలా అన్నింటా వెన్నంటే ఉన్నాడు అట్లూరి. ఒక్క ముక్కలో చెప్పాలంటే రామోజీరావు తన వెన్నెముకను కోల్పోయాడు.

ఈనాడు నుంచి ఫిలిమ్ సిటీ విస్తరణ దాకా ప్రతి అడుగులో అట్లూరి మార్క్ ఉంది. ఆయన ఆలోచన, శ్రమ, ప్రయాస లేకుండా రామోజీ గ్రూపు లేదు. ఈనాడు ఆర్థిక సామ్రాజ్యంలో పెరిగిన ప్రతి రూపాయి, ప్రతి ఆస్తి వెనుక అట్లూరి ఉన్నాడు. ఈనాడుతో పరిచయం ఉన్న అందరికీ ఆయన ఎంతటి కీలకమైన మనిషో తెలుసు. బయటి జనానికి ఆయన తెలియకపోవచ్చుగాక, రామోజీ గ్రూపుల సంస్థల్లో బోలెడు మంది ఎండీలు ఉండవచ్చు.కానీ ‘‘పెద్ద ఎండీ’’ ఒక్కడే ఆ ఒక్కడూ ఇప్పుడు లేడు.

అట్లూరి రామ్మోహనరావుది కృష్ణా జిల్లా, పెద్ద పారుపూడి. పుట్టింది 1935 ఏడాది.రామోజీరావు బాల్యస్నేహితుడు, క్లాస్‌మేట్ కూడా. 1975 లో రామోజీరావు పిలవగానే వచ్చి ఈనాడు గ్రూపుతో జాయినయ్యారు. ఆరోజు నుంచీ తనను అంటిపెట్టుకునే ఉన్నారు. రామోజీరావు స్వగ్రామం కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామాన్ని రామోజీ ఫౌండేషన్‌ కొన్నేళ్ల క్రితం దత్తత తీసుకుంది. ఊరంతటినీ బాగుచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను రామమోహనరావు స్వయంగా పర్యవేక్షించారు.

బాల్య స్నేహితుడు రామోజీరావు పిలుపు మేరకు రామమోహనరావు ఉపాధ్యాయ వృత్తిని వదిలి 1974లో ఈనాడులో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. 1978లో ఈనాడు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 1982లో ఎండీగా పదోన్నతి పొంది, 1995 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఫిల్మ్‌సిటీ నిర్మాణ వ్యవహారాల్లో పాలు పంచుకున్నారు. 1995లో ఫిల్మ్‌సిటీ ఎండీగా బాధ్యతలు చేపట్టి, సుదీర్ఘ కాలం పనిచేశారు. రామోజీరావు సూచనలకు అనుగుణంగా రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణంలో రాత్రీ పగలూ తేడా లేకుండా పని చేశారు. విమర్శలు, ఆరోపణలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ రామోజీరావు వెనుక తను స్థిరంగా నిలబడిన తీరు ఆశ్చర్యం అనిపిస్తుంది. అనితరసాధ్యంగా ఓ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించడం వెనుక ఆయన పోషించిన పాత్ర అపూర్వం. అదే అట్లూరి గొప్పతనం.