Site icon HashtagU Telugu

Narayana College: నారాయ‌ణ కాలేజి ఫీజుల జులుం, ఆత్మాహుతికి సిద్ధ‌మైన‌ విద్యార్థి

Narayana

Narayana

హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లోని నారాయణ కాలేజ్ విద్యార్థి పెట్రోలు పోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్పప‌డ్డారు. ఫీజు విష‌యంలో ప్రిన్సిపాల్ కు, విద్యార్థికి మ‌ధ్య జ‌రిగిన వివాదం స్టూడెంట్ ప్రాణాల మీద‌కు తెచ్చింది. పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ప్రిన్సిపల్ ని పట్టుకున్న ఘ‌ట‌న ఫీజుల జులంను నిరూపిస్తోంది. అయితే, పెట్రోలు పోసుకున్నది విద్యార్థి కాద‌ని విద్యార్థి సంఘం నేత‌గా ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చిందిత‌. విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ గా గుర్తించారు. ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డితో చర్చించటానికి స్టూడెంట్ సాయినాథ్ తో కలిసి కాలేజీకి వచ్చిన సందీప్ ప్రిన్సిపాల్ ను బెదిరించటానికి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా భావిస్తున్నారు.

గత సంవత్సరం నారాయణ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేసుకున్న సాయినాథ్ కు కాలేజీ యాజమాన్యం టీసీ ఇవ్వకుండా వేధిస్తోంది. కట్టాల్సిన ఫీజు బ్యాలెన్స్ ఉండటంతో యాజమాన్యం టీసీ ఇవ్వకుండా సాయినాథ్ ను ఇబ్బంది పెడుతోంది. ఆ ఏడాది ఇంజనీరింగ్ లో సాయినాథ్ జాయిన్ అవ్వాల్సి ఉంది. ఇంటర్ సర్టిఫికెట్ టీసీ తప్పనిసరి కావ‌డంతో సాయినాథ్ విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ సహాయం తీసుకున్నాడు. ప్రిన్సిపల్ తో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేద్దామని కాలేజీకి సాయినాథ్ తో కలిసి వచ్చాడు సందీప్. సాయినాథ్ కాలేజీకి కట్టాల్సిన రూ.16 వేలు ఫీజును మాఫీ చేసి సర్టిఫికెట్ ఇవ్వాలని కోరాడు. దానికి ప్రిన్సిపాల్ అంగీకరించలేదు. కట్టాల్సిన ఫీజు విషయంలో తగ్గేదేలేదని ప్రిన్సిపల్ చెప్పటంతో సందీప్ ప్రిన్సిపాల్ ను బెదిరించటానికి తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకున్నాడు.

పక్కనే ఉన్న దీపాలపై కూడా పెట్రోల్ పడటంతో హఠాత్తుగా సందీప్ కు మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి. ఊహించని ఈ ఘటనతో సందీప్ చటుక్కున ప్రిన్సిపాల్ ను పట్టేసుకున్నాడు. అదే సమయంలో పక్కనే ఉన్న ఏవో అశోక్ రెడ్డికి కూడా మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ మంటల్లో బాగా కాలిపోయాడు. దీంతో అతని పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరినీ కాలేజి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులంతా చెల్లాచెదురుగా పరుగులు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.