New CS Ramakrishna Rao : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ కే.రామకృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నేడు శాంతికుమారి పదవీ విరమణ చేశారు. దీంతో సీఎస్ గా రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. రామకృష్ణారావు వచ్చే ఆగష్టులో పదవీ విరమణ చేయనున్నారు. 1991 బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావు గతంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. సుధీర్ఘకాలం ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం దృష్ట్యా ఆయనను సీఎస్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమించినట్టు సమాచారం.
Read Also: Bangladesh : ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్..!
రామకృష్ణారావుకు పాలనాపరంగా ఉన్న అనుభవం, ఆర్థిక రంగంపై మంచి పట్టు ఉండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం సీఎస్ గా ఆయనను ఎంపిక చేసుకుంది. అటు బీఆర్ఎస్ పాలనలో, ఇటు కాంగ్రెస్ పాలనలోనూ రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించిన ఘనత ఆయనకు దక్కింది. రామకృష్ణారావు 2025 ఆగస్టు నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ప్రభుత్వం ఆయన పదవి కాలాన్ని మరో ఆరునెలలు పొడిగించే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఆయన 12ఏళ్లపాటు పనిచేశారు. మొత్తం 14 రాష్ట్ర బడ్జెట్లను రూపుదిద్దారు. వీటిలో 12 పూర్తిస్థాయి కాగా, మరో రెండు ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్లు. తొలుత 2014 నవంబరు 5న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
రామకృష్ణారావు 1991లో ఐఏఎస్ సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్గొండ, మహబూబ్‌నగర్, నిజామబాద్ జిల్లాల సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌గా, గుంటూరు, అదిలాబాద్ జిల్లాల కలెక్టర్‌గా, విద్యాశాఖ కమిషనర్‌గా, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నిన్నటి వరకు విధులు నిర్వహించారు. ఇక, ఇదివరకు సీఎస్ గా బాధ్యతలు నిర్వహించిన శాంతి కుమారికి ప్రభుత్వం మరో కీలక బాధ్యతలు అప్పజెప్పింది. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల విభాగం వైస్ ఛైర్మన్ గాను, ఎంసీఆర్హెచ్ఆర్డీ జనరల్ డైరెక్టర్ గాను బాధ్యతలు కట్టబెట్టింది.