Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్ర.. మసీద్, దర్గాలకు క్లాత్ చుట్టేసి?

భారతదేశం లోని హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి కూడా ఒకటి. శ్రీరామనవమి రోజున

  • Written By:
  • Publish Date - March 29, 2023 / 02:56 PM IST

భారతదేశం లోని హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి కూడా ఒకటి. శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని జరిపిస్తూ ఆ రోజున సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ప్రదేశాలలో ఈ శ్రీరామనవమి పండుగను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే రేపు అనగా మార్చి 30వ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇప్పటికే కొన్ని ప్రదేశాలలో ఘనంగా ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో శ్రీరామనవమి శోభాయాత్రకు నగరం ముస్తాబయింది.

అయితే శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రధాన కూడలిలో రహదారులపై ట్రాఫిక్ ఉండకుండా చూసుకోవడం కోసం ఇప్పటికే అందుకు తగిన విధంగా చర్యలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఊరేగింపుకు ముందుగా సిద్ది అంబర్ బజార్ మసీదు, దర్గాను క్లాత్‌ తో కప్పారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా బిజెపి నుండి సస్పెండ్ చేయబడిన గోషా మహల్ వివాదాస్పద ఎమ్మెల్యే టి రాజా సింగ్ రేపు మార్చి 30 న హైదరాబాద్‌లో రామనవమి శోభా యాత్రకు నాయకత్వం వహించబోతున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ఖాతాలో ఆ విషయాన్ని తెలుపుతూ రామ భక్తులందరినీ ఆహ్వానిస్తూ తన వీడియోను కూడా రాజాసింగ్‌ పంచుకున్నారు.

ఇక అన్ని ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో, సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా భారీగా బందోబస్తు ను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. కాగా రేపు మార్చి 30వ తేదీ ఉదయం 9 గంటలకు సీతారాంభాగ్ ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రోజు రాత్రి 7 గంటలకు కోటిలోని హనుమాన్ వ్యామశాల మైదానంలో ముగుస్తుంది. ఊరేగింపు భోయిగూడ కమాన్, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ రోడ్, జాలి హనుమాన్, ధూల్‌పేట్ పురానాపూల్ రోడ్, గాంధీ విగ్రహం, జుమేరాత్ బజార్, బేగంబజార్ ఛత్రి, సిద్దిఅంబర్ బజార్, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమన్, పుత్లీబౌలి కూడలి, కోటి మీదుగా సుల్తాన్ బజార్ మీదుగా సాగుతుంది. చివరగా హనుమాన్ వ్యామశాల వద్ద ఆగుతుంది. హైదరాబాద్‌లో శ్రీరామనవమి యాత్ర కావడంతో సిటీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. నిర్దేశిత మార్గం గుండా వెళ్లినప్పుడు ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. ప్రయాణికులు తాము వెళ్లాల్సిన గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.