CM Revanth Reddy : గ్రామ పంచాయతీ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల విధానంలో కీలక మార్పులు

CM Revanth Reddy : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ లలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహా లో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాలను ఇకపై నెలనెలా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో చెల్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 92,351 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు పనిచేస్తుండగా, వీరికి ప్రతి నెలా సుమారు రూ.116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉంది.

జీతాల చెల్లింపులో ఏదైనా ఆలస్యం లేకుండా, గ్రీన్‌ చానెల్‌ ద్వారా జీతాలు చెల్లించేందుకు ప్రత్యేక విధానం అమలు చేయాలని పంచాయతీ రాజ్‌, ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గురువారం ఇన్‌టిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను త్వరగా చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి మొత్తం 1.26 లక్షల ఉపాధి పనులు పూర్తయినట్లు సీఎం వెల్లడించారు. వీటికి సంబంధించిన బిల్లుల చెల్లింపులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి కేటాయించబడిన నిధులు కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు రావడానికి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన, ఉపాధి హామీ పథకాల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టాలని అధికారులను అప్రమత్తం చేశారు.

గ్రామ పంచాయతీలకు విడుదలైన నిధుల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ నిధులను గ్రామాల అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించేలా పర్యవేక్షణ వ్యవస్థను మెరుగుపర్చాలని సీఎం సూచించారు. సమావేశంలో, గ్రామాల అభివృద్ధి, ఉపాధి హామీ పథకాల అమలు, కేంద్ర నిధుల సమర్థ వినియోగంపై అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య విస్తృత చర్చ జరిగింది. పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tirupati Stampede Incident : తొక్కిసలాట ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న పవన్

  Last Updated: 09 Jan 2025, 10:07 PM IST