Rajiv Yuva Vikasam: తెలంగాణ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలతో ఉత్తర్వు జారీ అయింది. ఇందులో లబ్ధిదారుల అర్హతలు, వయో పరిమితి, వార్షిక ఆదాయ పరిమితి, యూనిట్లకు ఇచ్చే రాయితీలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం వంటి వివరాలను ప్రస్తావించారు. దాదాపు ఐదు లక్షల మందికి లబ్ధిని చేకూర్చనున్న ఈ పథకం వివరాలను మనం తెలుసుకుందాం..
Also Read :BYD Car Plant : హైదరాబాద్‌కు మెగా ప్రాజెక్ట్.. భారీ పెట్టుబడితో బీవైడీ కార్ల ప్లాంట్
రాయితీలు.. ఎవరికి ఎంత ?
- రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకం ద్వారా నాలుగు రకాల యూనిట్లను మంజూరు చేస్తారు. రూ.50వేలలోపు, రూ.50వేల నుంచి రూ.1 లక్షలోపు, రూ.1లక్ష నుంచి రూ.2 లక్షలలోపు, రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలలోపు అనే యూనిట్లు ఉంటాయి.
- యూనిట్ విలువను బట్టి ఆయా లబ్ధిదారులకు అందే రాయితీ మారిపోతుంది. రాయితీపోను మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా అందిస్తారు. లబ్ధిదారుడి వాటా ఉండదు.
- రూ.50 వేలలోపు యూనిట్‌ను పొందే వారికి ప్రభుత్వం 100 శాతం రాయితీ ఇస్తుంది.
- రూ.50,001 నుంచి రూ.లక్ష యూనిట్‌ను పొందే వారికి 90 శాతం రాయితీ లభిస్తుంది.
- రూ.1,00,001-రూ.2లక్షల యూనిట్‌ను పొందే వారికి 80 శాతం రాయితీ ఇస్తారు.
- రూ. 2 లక్షలకుపైన విలువ చేసే యూనిట్‌ను పొందే వారికి 70 శాతం రాయితీ ఇస్తారు.
Also Read :California Almonds : మెరుగైన ఆరోగ్యం పొందడానికి అత్యంత సహజమైన విధానం
దరఖాస్తు ప్రక్రియ ఇదీ..
- నిరుద్యోగ యువతీ యువకులు http://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలి.
- ఈ పథకానికి మార్చి 17 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
- దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అర్హత పత్రాలతోపాటు హార్డ్ కాపీని సంబంధిత అధికారులకు అందజేయాలి.
- గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయంలో, పట్టణ ప్రాంతాల వారు పురపాలక సంఘాల్లో, నగరాల్లో ఉండేవారు నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయాల్లో దరఖాస్తు కాపీలను సమర్పించాలి.
- ఏప్రిల్ 6 నుంచి మే 20 వరకు మండల స్థాయిలో దరఖాస్తులను పరిశీలిస్తారు. ఎంపిక చేసిన దరఖాస్తులను జిల్లా స్థాయి పరిశీలనకు పంపుతారు.
- మే 21 నుంచి 31 వరకు జిల్లా స్థాయిలో దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. అక్కడ ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి పంపుతారు.
- మంత్రి ఆమోదం పొందిన దరఖాస్తులను ఈ పథకంలో లబ్ధికి ఎంపిక చేస్తారు.
- తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు.
- లబ్ధిదారులకు వారం నుంచి పక్షం రోజుల పాటు స్వయం ఉపాధిలో శిక్షణ ఇస్తారు. రాయితీ విడుదలైన 16 రోజుల్లోగా లబ్ధిదారుడు బ్యాంకు ఖాతాను తెరవాలి.
అర్హులు ఎవరు ?
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్ల సభ్యు లు, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ ఫెడరేషన్లు, ఈబీసీ వర్గాల వారు రాజీవ్ యువ వికాసం కోసం అప్లై చేయొచ్చు.
- దరఖాస్తుదారుల వయసు 21 నుంచి 55 ఏళ్లలోపు ఉండాలి.
- వ్యవసాయ అనుబంధ రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి గరిష్ఠ వయోపరిమితి 60 సంవత్సరాలు. వీరికి పట్టాదార్ పాస్‌పుస్తకం తప్పనిసరి.
- రవాణా రంగానికి సంబంధించిన యూనిట్‌ను ఏర్పాటు చేసేవారికి డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.
- దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఉండాలి.
- దరఖాస్తుదారులకు రేషన్‌కార్డు తప్పనిసరి.రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధ్రువ పత్రాన్ని సమర్పించాలి.
- వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకుండా ఉండాలి.
- ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.తెలంగాణ ఏర్పాటైన తర్వాత జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రాలనే పరిగణనలోకి తీసుకుంటారు.
- దరఖాస్తు సమయంలో పాస్‌పోర్టు సైజు ఫొటోను అప్‌లోడ్ చేయాలి.