Rajeev Swagruha : రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు, టవర్స్, ఖాళీ స్థలాలను విక్రయించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. తద్వారా రూ.800 కోట్ల దాకా ఆదాయాన్ని సముపార్జించాలని తెలంగాణ సర్కారు టార్గెట్‌గా పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బండ్లగూడలో ఉన్న 159 ఫ్లాట్ల విక్రయం ద్వారా రూ. 30 కోట్లు, పోచారంలోని 601 ఫ్లాట్ల విక్రయం ద్వారా రూ. 98 కోట్లు, పోచారం, గాజులరామారం, జవహర్‌నగర్‌లలో అసంపూర్తిగా ఉన్న టవర్ల విక్రయం ద్వారా రూ.637 కోట్లను పొందొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈమేరకు వివరాలతో వారు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది.
Also Read :Delhi Polls : బీజేపీ ఫస్ట్ లిస్ట్.. కేజ్రీవాల్‌పై పర్వేశ్, అతిషిపై బిధూరి పోటీ
మొదటి దశలో..
రాజీవ్ స్వగృహ(Rajeev Swagruha) ఫ్లాట్లు, టవర్స్, ఖాళీ స్థలాలను రెండు విడతల్లో విక్రయిస్తారని తెలుస్తోంది. మొదటి దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 760 ఫ్లాట్లను (పనులన్నీ పూర్తయినవి) అమ్మేయనున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతులు కూడా మంజూరు చేసింది. తొలుత బండ్లగూడలో 159, పోచారంలో 601 ఫ్లాట్లను వేలం వేస్తారు. తొలి విడతలో వేలం ప్రక్రియను వచ్చే నెలలో(ఫిబ్రవరిలో) చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రెండో దశలో..
రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్లలో నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాని అసంపూర్ణ ఫ్లాట్లను రెండో దశలో అమ్మేస్తారు. పోచారం, గాజులరామారం, జవహర్‌నగర్‌లలోని 28 టవర్స్‌లో పెద్ద సంఖ్యలో అసంపూర్తి ఫ్లాట్లు ఉన్నాయి. అందుకే ఆయా టవర్లను వేలం ప్రక్రియ ద్వారా బిల్డర్స్‌కు అప్పగించాలని డిసైడ్ చేశారు. అసంపూర్తిగా మిగిలిపోయిన రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్లను, టవర్లను పూర్తి చేసి విక్రయించుకునేందుకు ఆసక్తి చూపే బిల్డర్లకు మాత్రమే తొలి విడత వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.
Also Read :700 Women Extortion: ‘అమెరికా మోడల్‌ను’ అంటూ.. 700 మంది అమ్మాయిలకు కుచ్చుటోపీ
గత ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణంతో పాటు ప్లాట్ల విక్రయం చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం భూములను బదలాయించింది. ఆయా భూముల్లో టవర్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించారు. ఈక్రమంలోనే రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో భారీగా ఇళ్లు, స్థలాలు మిగిలిపోయాయి. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ ఇళ్ల స్కీంకు నిధులను సమకూర్చుకునేందుకు.. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో మిగిలిపోయిన ఇళ్లు, స్థలాలను అమ్మేస్తోంది.