ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) మళ్లీ యూటర్న్ తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అప్పటివరకు పార్టీని టార్గెట్ చేస్తూ కఠిన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యల్లో బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. ధర్మం కోసం పని చేసే ఏకైక పార్టీ బీజేపీనే అని రాజాసింగ్ ప్రకటించడంతో ఆయన తిరిగి కమలం గూటికి చేరనున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
రాజాసింగ్ మాట్లాడుతూ.. తనను ఎవ్వరి పార్టీ కూడా భరించలేరని.. తెలంగాణలో బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ ఎంఐఎంతో కూర్చున్నవేనని పేర్కొన్నారు. ధర్మం, హిందుత్వం కోసం మాత్రమే తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని, అలాంటి సిద్ధాంతాలు ఉన్న పార్టీ మాత్రం బీజేపీయే అని చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో పని చేయాలన్న అభిమానం తనకుందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో రాజాసింగ్ మళ్లీ బీజేపీతో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామాలపై బీజేపీ పార్టీలోనూ చర్చ మొదలైంది. ఇటీవల రాజాసింగ్‌పై విమర్శలు చేసిన మాధవీలతను పార్టీ నేతలు మందలించినట్లు సమాచారం. ఆమెను మీడియా ముందు సైలెంట్ గా ఉండాలని సూచించారని అంటున్నారు. దీనితోపాటు రాజాసింగ్‌పై గతంలో ఉన్న ఆగ్రహాన్ని పక్కన పెట్టి ఆయన పాజిటివ్ వ్యాఖ్యలకు స్పందిస్తున్న కమలం నేతలు, ఆయన తిరిగి పార్టీలో చేరికపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
రాజాసింగ్ తిరిగి బీజేపీలోకి వస్తే హైదరాబాద్ రాజకీయాల్లో మరోసారి సంచలనం తప్పదని భావిస్తున్నారు. ముస్లిం ఓట్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఆయన తీవ్ర హిందుత్వ వ్యాఖ్యలు, బలమైన ఓటు బ్యాంక్ ప్రభావం పార్టీకి కీలకంగా మారవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా రాజీనామా తర్వాత రాజకీయంగా నిశ్శబ్దంలోకి వెళ్లిన రాజాసింగ్.. మళ్లీ కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.