Lunch Motion Petition : జన్వాడ ఫాంహౌస్ కేసులో కొత్త మలుపు ఏర్పడింది. తాజాగా తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల అలియాస్ పాకాల రాజేంద్ర ప్రసాద్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని రాజ్ పాకాల తెలిపారు. ఈ నేపథ్యములో హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ సమర్పించారు.
ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరోవైపు, జన్వాడ ఫాంహౌస్ కు సంబంధించి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టతనిచ్చారు. అది ఫాంహౌస్ కాదని, తన బామ్మర్ది ఇల్లు అని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేదని ఆయన అన్నారు. తమ బంధువులపై కుట్రలు చేస్తున్నారని రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు జన్వాడ ఫామ్ కేసులో మోకిలా పోలీసులు రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేశారు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒరియన్ విల్లాలో ఉన్న రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించేందుకు ప్రయత్నించిన పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగి అక్కడ ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.
అయితే అర్ధరాత్రి మోకిలా పోలీసులు ఒరియన్ విల్లాలోని రాజ్ పాకాల విల్లా నెంబర్ 40 వద్ద నోటీసులు అంటించారు. సోమవారం ఉదయం 11 గంటల వరకు మోకిలా పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. సెక్షన్ 35(3)బీఎన్ ఎస్, ఎఫ్ ఐఆర్ నెంబర్ 311/2024 అండర్ సెక్షన్ 25, 27, 29 ఎన్డీపీఎస్ యాక్ట్ 1985, సెక్షన్ 3, 4 తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు.