Medical Scam: మెడిక‌ల్ స్కామ్ పై `రాజ్ భ‌వ‌న్` కొర‌ఢా

మెడిక‌ల్ సీట్ల దందాను త‌వ్వితీసే ప్ర‌య‌త్నం తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై మొద‌లుపెట్టారు. వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో మెడికల్ పీజీ సీట్ల కుంభకోణం బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - April 22, 2022 / 01:33 PM IST

మెడిక‌ల్ సీట్ల దందాను త‌వ్వితీసే ప్ర‌య‌త్నం తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై మొద‌లుపెట్టారు. వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో మెడికల్ పీజీ సీట్ల కుంభకోణం బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మెడిక‌ల్ పీజీ సీట్ల విష‌యంలో జ‌రిగిన భారీ స్కాంకు సంబంధించిన నివేదిక‌ను గ‌వ‌ర్న‌ర్ కోరారు. ఆ మేర‌కు యూనివ‌ర్సిటీ వైఎస్ ఛాన్స‌ల‌ర్ నివేదిక‌ను త‌యారు చేస్తున్నార‌ని తెలుస్తోంది. విద్యార్థులు న‌ష్ట‌పోకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు జారీ చేయ‌డం మ‌రోసారి ప్ర‌గ‌తిభ‌వ‌న్‌, రాజ్ భ‌వ‌న్ మ‌ధ్య యుద్దానికి తెర‌లేచింది.
పేద విద్యార్థులకు అందాల్సిన సీట్లను కొందరు యూనివర్సిటీ అధికారులు, ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు వేల కోట్ల రూపాయలకు అమ్మేస్తున్నారు.

కాళోజీ యూనివర్సిటీలో మెడికల్ సీట్ల స్కాం దెబ్బ‌కు ప్రతిభగల విద్యార్థులు సీట్ల‌ను పొంద‌లేక‌పోయారు. మెడికల్ సీట్ల స్కాం పక్కా ప్లాన్‌తో జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీట్లను ముందుగా బ్లాక్ చేసి తర్వాత వాటిని అమ్మేసేందుకు స్కెచ్ వేశారు. ఇలాంటి స్కాంకు సంబంధించి ప్రాథ‌మికంగా 40కిపైగా అనుమానాస్పద దరఖాస్తులను గుర్తించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ కూడా మెడికల్ స్కాం విషయాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు తెలుస్తోంది. మంత్రి ఆదేశాలతో వరంగల్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. ఇందుకు సంబంధించి కేసు ను దర్యాప్తు జరిపి దొంగలను పట్టుకుంటామని పోలీసు అధికారి ఒక‌రు చెబుతున్నారు.
మెడిక‌ల్ సీట్ల దందాల‌తో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులపై గ‌వ‌ర్న‌ర్‌ ఆరా తీస్తున్నారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేశ్‌ ఆత్మహత్య ఘటనపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో రామాయంపేటలో తల్లీ, కుమారుడి ఆత్మహత్య ఘటనపై నివేదిక కోరారు. భువనగిరి పరువు హత్య, సూర్యాపేట జిల్లాలో సామూహిక అత్యాచార ఘటనపై కూడా పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మీడియాలో వచ్చిన వార్తలు, బీజేపీ రాష్ట్ర శాఖ వినతి ఆధారంగా గవర్నర్ ఆ మేర‌కు నివేదిక‌ల‌ను కోరార‌ని రాజ్ భ‌వ‌న్ వ‌ర్గాలు చెబున్నాయి. కానీ, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆమె ప‌నిచేస్తున్నార‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారానికి తాజాగా ఆమె కోరిన నివేదిక‌లు బ‌లం చేకూర్చుతున్నాయి.
ప‌లు జిల్లాల్లో జ‌రిగిన దురాగ‌తాల‌తో పాటు మెడిక‌ల్ సీట్ల దందాపై ప్ర‌త్యేకంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై ఆరా తీస్తున్నారు. వారం రోజుల్లో మెడికల్ సీట్ల గోల్ మాల్ పై నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. అంతేకాదు, సీట్ల దందా వెనుక టీఆర్ఎస్ లీడ‌ర్లు ఉన్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కుంభ‌కోణం వెనుక ఇద్ద‌రు మంత్రులు కూడా ఉన్నార‌ని రాజ్ భ‌వ‌న్ కు స‌మాచారం అందింద‌ని సమాచారం. అందుకే, ఒక డాక్ట‌ర్ గా మెడిక‌ల్ సీట్ల దందాపై ప్ర‌త్యేకంగా ఆరా తీస్తున్నారు. తెలంగాణ స‌ర్కార్ మెడిక‌ల్ సీట్ల కుంభ‌కోణాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని గ‌వ‌ర్న‌ర్ ప‌క్కా స్కెచ్ వేశార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే యూనివ‌ర్సిటీ రిజిస్ట్రార్ మెడిక‌ల్ సీట్ల దందాను బ‌య‌ట‌పెట్టారు. పోలీసు క‌మిష‌న‌ర్ నేరుగా విచార‌ణ చేస్తున్న‌ప్ప‌టికీ నిజాలు వెలుగుచూడ‌లేదు. దీంతో రంగంలోకి దిగిన త‌మిళ సై తెలంగాణ ప్ర‌భుత్వ మెడిక‌ల్ కుంభ‌కోణాన్ని బ‌య‌ట‌పెట్టేందుకు న‌డుంబిగించారు. వేల కోట్ల రూపాయాల మెడిక‌ల్ సీట్ల దందా బ‌య‌ట‌కొస్తే, తెలంగాణ ప్ర‌భుత్వం అభాసుపాలుకావ‌డం త‌థ్యం.