Site icon HashtagU Telugu

Rain Effect: చెరువులను తలపిస్తున్న నానక్‌రామ్‌గూడ: వైరల్ వీడియో

Rain Effect

New Web Story Copy 2023 06 27t163058.127

Rain Effect: వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఎక్కడ మ్యాన్ హొల్స్ తెరిచి ఉంటాయోనని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహణలో ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారాయి. హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ నానక్ రామ్ గూడలో రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసహనానికి గురైన ఓ ప్రయాణికుడు సదరు పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

తాజాగా కురిసిన తేలికపాటి వర్షానికి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ నానక్ రామ్ గూడలోని ప్రధాన రహదారి నీటమునిగింది. మోకాళ్ళ లోతు నీరు నిల్వ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఎకరం రెండు వందల కోట్లు పలికే రోడ్ల పరిస్థితి చూడండి అంటూ ఆ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కార్లలో ప్రయాణించే వారి పరిస్థితి అటుంచితే ద్విచక్రవాహనదారులు ఎప్పుడు ప్రమాదానికి గురవుతారో వీడియో చూస్తుంటే అర్ధం అవుతుంది. రోడ్ల నిర్మాణానికి వందల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వాలు ఈ పరిస్థితి చూడండయ్యా అంటూ ఆ వ్యక్తి మండిపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

 

ఓ వైపు హైదరాబాద్ ఊహకందని రీతిలో అభివృద్ధి చెందుతుంది. మరోవైపు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నగరంలోని రోడ్ల సమస్య ఈ నాటిది కాదు. కానీ నగరం ఎంత డెవలప్ అయినా రోడ్లు పరిస్థితి మాత్రం మారడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

Read More: AP BRS: వైసీపీ పాలనలో దగా పడ్డ ఆంధ్ర ప్రజానీకం: బిఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట